బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి కార్పొరేట్ క్రెడిట్ కార్డును దుర్వినియోగం చేసి ఏకంగా రూ. 27 లక్షలకు పైగా స్వాహా చేశాడు. అంతేకాకుండా, దీనిపై నిలదీసిన సీనియర్ మేనేజ్మెంట్ను అసభ్యకరమైన కంటెంట్‌తో బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
అసలేం జరిగిందంటే, అధికారిక ఖర్చుల కోసం ఆ ఉద్యోగికి రూ. 2 లక్షల లిమిట్ ఉన్న కార్పొరేట్ క్రెడిట్ కార్డును కంపెనీ కేటాయించింది. అయితే, అక్టోబర్ 2023 మరియు జనవరి 2024 మధ్య కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే అతను రూ. 27,01,139 దుర్వినియోగం చేసినట్లు సమాచారం.
చైనా, పాకిస్థాన్ వ్యక్తుల బెదిరింపులే కారణమంటూ సాకులు: ఖర్చులలో తేడాలను గుర్తించిన కంపెనీ, జనవరి 12, 2024న ఈమెయిల్ ద్వారా సదరు ఉద్యోగిని వివరణ కోరింది. దానికి సమాధానంగా జనవరి 15న అతను తన తప్పును అంగీకరించాడు. అయితే, చైనా మరియు పాకిస్థాన్‌కు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరించడం వల్లే తాను ఇలా చేయాల్సి వచ్చిందని వింత వాదనను వినిపించాడు.
తర్వాత ఆ మొత్తాన్ని మూడు వాయిదాల్లో తిరిగి చెల్లిస్తానని కంపెనీకి హామీ ఇచ్చాడు. జనవరి 29న పంపిన మెయిల్లో.. ఫిబ్రవరి రెండో వారంలో రూ. 10 లక్షలు చెల్లిస్తానని, మిగిలిన మొత్తాన్ని తర్వాత కడతానని చెప్పాడు. కంపెనీ అతనికి తగినంత సమయం మరియు అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ, అతను ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించలేదు.
ముదిరిన వ్యవహారం: డబ్బు అడిగినందుకు వ్యవహారం మరింత ముదిరింది. ఫిబ్రవరి 9, 2024న ఆ ఉద్యోగి తన మేనేజర్‌కు అసభ్యకరమైన చిత్రాలను పంపడమే కాకుండా, తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు.
దీనితో కంపెనీ యాజమాన్యం అధికారికంగా ఫిర్యాదు చేసింది. కంపెనీ ఫిర్యాదు మేరకు వర్తూరు పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
