మహారాష్ట్రలోని జాల్నా జిల్లా అంబాద్ ప్రాంతంలో ఒక వివాహితకు, అదే ప్రాంతానికి చెందిన బాబాసాహెబ్ రాథోడ్ అనే వ్యక్తికి మధ్య గత 10 ఏళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది.
పథకం ప్రకారం హత్య: ప్రియురాలు తన భర్తను వదిలేసి తనతోనే కలిసి ఉండాలని ప్రియుడిని కోరుతోంది. అయితే, అప్పటికే వివాహితుడైన రాథోడ్‌కు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లడం ఇష్టం లేదు. ఆమె ఇబ్బంది నుంచి శాశ్వతంగా విముక్తి పొందాలని ఒక భయంకరమైన పథకం వేశాడు.
నడిరాత్రి ప్రియురాలిని చెరువు గట్టు వద్దకు పిలిపించిన రాథోడ్.. “ఈ ప్రపంచం మనల్ని బతకనివ్వదు, అందుకే మనమిద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం” అని ఎమోషనల్‌గా మాట్లాడి ఆమెను నమ్మించాడు.
ఈత వచ్చు కదా అని..: ఇద్దరం చేయి చేయి పట్టుకుని నీళ్లలోకి దూకుదాం అని చెప్పి, ఆమెను నదిలోకి నెట్టేశాడు. తాను కూడా దూకినట్లు నటించాడు. రాథోడ్‌కు ఈత రావడంతో చాకచక్యంగా ఒడ్డుకు చేరుకోగా, అతడిని నమ్మి నీళ్లలోకి దూకిన ఆ మహిళ పాపం ప్రాణాలు కోల్పోయింది.
ప్రియురాలు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. కానీ, పోలీసుల శైలి విచారణలో ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్య అని తేలింది. ప్రస్తుతం ఆ కిరాతక ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
