కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య ధరించిన దుస్తుల విషయంలో గొడవపడి, ఆమెకు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగింది? హత్తరవాడ గ్రామంలో నివసించే కృష్ణ పాటిల్ అనే వ్యక్తి, తన భార్య మంజుల ‘నైటీ’ ధరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన కృష్ణ, ఇంట్లోనే ఆమెపై నిప్పు పెట్టినట్లు సమాచారం. మంజుల కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె బెల్గాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (BIMS)లో చికిత్స పొందుతోంది.
కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదం: నిందితుడు కృష్ణ పాటిల్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. మంజుల నైటీ వేసుకోకూడదని అతను గత కొద్దిరోజులుగా ఆమెతో గొడవ పడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన రోజున, భర్త హెచ్చరికను పక్కన పెట్టి మంజుల నైటీ ధరించింది. దీంతో కోపం పెంచుకున్న కృష్ణ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
కేసు నమోదు: కృష్ణ, మంజులకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దారుణ ఘటన గురించి స్థానికులు సమాచారం అందించడంతో నందిగడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.
