బెంగళూరు: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. నమ్మిన వారిని నడిరోడ్డుపై వదిలేసి, అక్రమ సంబంధాల కోసం పారిపోతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరులో ఇటువంటిదే ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
కటింగ్ షాపు యజమానితో ప్రియాంక పరార్: బెంగళూరులోని బగలగుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ప్రియాంక అనే వివాహిత, తన భర్త మరియు పిల్లలను వదిలేసి పక్కింటి కటింగ్ షాపు యజమానితో కలిసి రాత్రికి రాత్రే పారిపోయింది. ప్రియాంక చేసిన ఈ పనితో ఆమె భర్త, పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
అసలు ఏం జరిగింది? ఏప్రిల్ 11వ తేదీ రాత్రి, “ఇంట్లోని చెత్తను బయట పడేసి వస్తాను” అని చెప్పి ప్రియాంక బయటకు వెళ్లింది. అయితే, ఆమె వెళ్లే ముందే తన భర్త శరత్ కుమార్ మరియు పిల్లలకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. వారు గాఢ నిద్రలో ఉండగా, ఒక చేతిలో చెత్త బకెట్, మరో చేతిలో బట్టల బ్యాగ్ పట్టుకుని ప్రియుడితో కలిసి పరారైంది. ఆమె ఇంటి నుండి బయటకు వెళ్తున్న దృశ్యాలు సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
రిఛార్జ్ వివరాలతో బయటపడ్డ బంధం: ప్రియాంకకు తన ఇంటి పక్కనే కటింగ్ షాపు నడుపుతున్న ప్రభు అనే వ్యక్తితో కొద్దిరోజుల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త శరత్ కుమార్ పనికి వెళ్లిన సమయంలో వీరిద్దరూ తరచుగా కలుసుకునేవారు. అయితే, భార్య మొబైల్‌కు ఎవరో రిఛార్జ్ చేస్తున్నారని అనుమానం వచ్చిన శరత్ కుమార్ ఆరా తీయగా, ప్రభుతో ఆమెకున్న బంధం బయటపడింది. భర్త రెండు మూడు సార్లు హెచ్చరించినప్పటికీ ప్రియాంక వినకుండా ఈ సాహసానికి ఒడిగట్టింది.
ప్రియాంక కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో, భర్త శరత్ కుమార్ బగలగుంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
