‘ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశారు’.. ఓటింగ్‌కు ముందే మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి కొనసాగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు నుండి షాకింగ్ వార్త అందింది. ఒక కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రవర్తనపై ధర్మాసనం అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేసింది.

జస్టిస్ పీకే మిశ్రా మరియు జస్టిస్ ఎన్వీ అంజారియా నేతృత్వంలోని బెంచ్ మమతా బెనర్జీని మందలిస్తూ.. దర్యాప్తు మధ్యలో జోక్యం చేసుకోవడం తీవ్రమైన విషయమని పేర్కొంది. కోల్‌కతాలోని రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐ-ప్యాక్’ (I-PAC) పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన సోదాల వివాదానికి సంబంధించి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దర్యాప్తు ప్రక్రియలో ఆటంకం కలిగించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇప్పుడు అటు న్యాయపరంగా, ఇటు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.

‘దర్యాప్తులో జోక్యం చేసుకోవడం వ్యవస్థకే ముప్పు’: విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు విస్తుపోయే వ్యాఖ్యలు చేసింది. “దేశంలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా దర్యాప్తు మధ్యలో జోక్యం చేసుకునే రోజు వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు” అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇది కేంద్రం వర్సెస్ రాష్ట్రం వివాదం కాదని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేయడంపై ఉన్న వివాదమని కోర్టు పేర్కొంది.

ముఖ్యమంత్రి చేసిన ఈ పని నేరుగా ప్రజాస్వామ్యానికే ముప్పు అని కోర్టు అభివర్ణించింది. జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చర్య మొత్తం వ్యవస్థనే రిస్క్‌లో పడేసిందని అన్నారు.

సీర్వాయి, అంబేడ్కర్ కూడా ఊహించి ఉండరు: టీఎంసీ తరపు న్యాయవాదులు ఇది సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన వివాదమని వాదించినప్పటికీ, కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. “ఏ ముఖ్యమంత్రి కూడా దర్యాప్తు జరుగుతున్న చోటుకి స్వయంగా వెళ్లకూడదు. దీనిని కేంద్ర-రాష్ట్ర వివాదంగా చూపి మీరు సమర్థించుకోలేరు” అని కోర్టు మండిపడింది. రాజ్యాంగ నిపుణులు సీర్వాయి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వంటి దిగ్గజాలు కూడా ఒక ముఖ్యమంత్రి స్వయంగా దర్యాప్తు జరుగుతున్న ఆఫీసులోకి వెళ్తారని ఊహించి ఉండరని బెంచ్ వ్యాఖ్యానించింది.

ఐదుగురు జడ్జిల బెంచ్‌కు పంపే ప్రసక్తే లేదు: టీఎంసీ తరపు న్యాయవాది మేనకా గురుస్వామి ఈ పిటిషన్‌ను ఐదుగురు జడ్జిల రాజ్యాంగ బెంచ్‌కు పంపాలని కోరగా, సుప్రీంకోర్టు ఆ విన్నపాన్ని నిరాకరించింది. ఇందులో రాజ్యాంగపరమైన సంక్లిష్ట ప్రశ్నలు ఏమున్నాయని కోర్టు ప్రశ్నించింది. ఈడీ అధికారులు తమపై జరిగిన దాడుల నేపథ్యంలో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ విచారణ జరుగుతోంది.


Posted

in

by

Tags: