న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే సముద్రగర్భ డేటా కేబుల్స్ ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వకంగా దెబ్బతినే అవకాశం ఉందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) హెచ్చరించింది. ఇరాన్ వార్తా సంస్థ ‘తస్నిమ్’ బుధవారం ప్రచురించిన నివేదిక ప్రకారం, ఒకేసారి పలు కీలక కేబుల్స్ దెబ్బతినడం వల్ల పర్షియన్ గల్ఫ్ అంతటా ఇంటర్నెట్ అంతరాయాలు ఏర్పడవచ్చు.
హోర్ముజ్ జలసంధిని ‘డిజిటల్ ఆర్టరీ’ (డిజిటల్ రక్తనాళం) అని పిలుస్తారు. ఎందుకంటే ప్రపంచ సమాచార మార్పిడికి వెన్నెముకగా నిలిచే ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్‌లో ఎక్కువ భాగం ఈ మార్గం గుండానే వెళ్తాయి. ఒకవేళ ఈ కేబుల్స్ తెగిపోతే, ఆ ప్రభావం కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఆసియా, యూరప్ మరియు మిడిల్ ఈస్ట్‌లను కలిపే ప్రాంతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో సుమారు 17% నుండి 30% వరకు ఈ లైన్ల ద్వారానే జరుగుతుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాల మద్దతుతో నడిచే యూఏఈ, సౌదీ అరేబియాలోని భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌లు ఈ కేబుల్స్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ఈమెయిల్స్ నుండి క్లౌడ్ సేవల వరకు, గ్లోబల్ ఆర్థిక లావాదేవీల వరకు అన్నీ ఈ అండర్ వాటర్ నెట్‌వర్క్‌పైనే ఆధారపడి పనిచేస్తాయి.
భారత్‌పై ప్రభావం: ప్రపంచంలోనే అతిపెద్ద డేటా వినియోగదారులలో ఒకటైన భారత్ యొక్క డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఈ కనెక్షన్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ కేబుల్స్‌కు అంతరాయం కలిగితే మిలియన్ల కొద్దీ వినియోగదారులకు ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుంది. అంతేకాకుండా క్లౌడ్ సర్వీసెస్, డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ (UPI వంటివి) తీవ్ర సంక్షోభంలో పడతాయి. ఇది ఐటీ మరియు ఏఐ (AI) ఆధారిత సేవా రంగాలకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.
ప్రస్తుతం ఒమన్, యూఏఈ, పాకిస్థాన్‌తో సహా సంఘర్షణ ప్రాంతానికి సమీపంలో ఉన్న పలు దేశాల ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా ఈ నెట్‌వర్క్ పనిచేస్తోంది. ఈ కేబుల్స్ ఏర్పాటు బాధ్యత వహించే ఫ్రెంచ్ ప్రభుత్వ సంస్థ ‘అల్కాటెల్ సబ్‌మెరైన్ నెట్‌వర్క్స్’ అప్రోక్షంగా తమ భాగస్వాములకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలోని దమ్మామ్ తీరంలో ఈ కంపెనీకి చెందిన కేబుల్ ఇన్‌స్టాలేషన్ నౌక ‘ఐల్ డి బాట్స్’ చిక్కుకుపోయింది. మెటా (ఫేస్‌బుక్) ఇప్పటికే తన సముద్రగర్భ కేబుల్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి.
