న్యూఢిల్లీ: ఆగ్నేయ ఢిల్లీలోని ఒక సంపన్న ప్రాంతంలో సీనియర్ IRS అధికారి కుమార్తెను హత్య చేసిన కేసులో నిందితుడైన మాజీ పనివాడు రాహుల్ మీనాను ఏప్రిల్ 23న ఢిల్లీ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఈ సందర్భంగా నిందితుడు కోర్టులో, తన నేరాన్ని అంగీకరించాడు.
జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దీపికా థాక్రాన్ నిందితుడిని కస్టడీ విచారణకు అనుమతించారు. ముఖానికి గుడ్డ కప్పుకుని ఉన్న మీనాను మధ్యాహ్నం 2:30 గంటలకు కిక్కిరిసిన కోర్టు హాల్లో హాజరుపరిచారు. విచారణ సమయంలో, మెడికో-లీగల్ రిపోర్ట్ (MLC)లో పేర్కొన్న గాయాల గురించి మేజిస్ట్రేట్ ప్రశ్నించగా.. మిద్దె పైనుండి దిగుతుండగా తనకు గాయాలయ్యాయని చెప్పాడు. కోర్టు మరిన్ని ప్రశ్నలు వేయగా, తను నేరం చేశానని, తప్పు జరిగిపోయిందని ఒప్పుకున్నాడు.
నేరం ఎందుకు చేశావని కోర్టు అడగ్గా.. లాకర్ తెరవడానికి మృతురాలి వేలిముద్రలు అవసరమయ్యాయని మీనా వివరించాడు. అయితే, దీనిని అధికారిక వాంగ్మూలంగా పరిగణించబోమని కోర్టు స్పష్టం చేసింది. సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి కుమార్తెను స్పృహ తప్పే వరకు కొట్టి, ఆపై అత్యాచారం చేసి, లాకర్ తెరవడం కోసం కిందకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె వేలిముద్రలతో లాకర్ రాకపోవడంతో, ఒక పరికరంతో దానిని పగులగొట్టి నగదు, నగలు దొంగిలించాడు.
12 గంటల్లో రెండు అత్యాచారాలు: ఢిల్లీని వణికించిన ఈ హత్య వెనుక భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 23 ఏళ్ల రాహుల్ మీనా కేవలం 12 గంటల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఢిల్లీ) రెండు అత్యాచారాలు, ఒక హత్య మరియు దొంగతనానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసి, అక్కడి నుండి ఢిల్లీకి చేరుకుని బుధవారం ఉదయం తన పాత యజమాని కుమార్తెపై ఘాతుకానికి ఒడిగట్టాడు.
IRS అధికారి ఇంట్లో ఏం జరిగింది? బుధవారం ఉదయం 6:30 గంటలకు మీనా నివాస సముదాయంలోకి ప్రవేశించాడు. గతంలో అక్కడ పని చేయడంతో అతనికి సెక్యూరిటీ సిస్టమ్స్ మరియు కీ కార్డ్ ఎక్కడ ఉంటుందో తెలుసు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆ యువతి సివిల్స్ కోసం సిద్ధమవుతూ మిద్దె పై గదిలో చదువుకుంటోంది. తల్లిదండ్రులు జిమ్ మరియు వాకింగ్‌కు వెళ్లిన సమయంలో మీనా ఆమెపై దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో ఒక బరువైన వస్తువుతో కొట్టి, స్పృహ తప్పాక లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఫోన్ ఛార్జింగ్ వైరుతో గొంతు నులిమి చంపాడు.
ఆ తర్వాత స్పృహలో లేని యువతిని కిందకు ఈడ్చుకెళ్లి బయోమెట్రిక్ లాకర్ తెరవడానికి ఆమె వేలిముద్రలను వాడాడు. అది విఫలం కావడంతో లాకర్ పగులగొట్టి రూ. 2 నుండి 2.5 లక్షల నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు.
పోలీసుల దర్యాప్తు: రక్తం మరకలైన బట్టలు మార్చుకుని, బాధితురాలి సోదరుడి ప్యాంట్, చెప్పులు వేసుకుని ఉదయం 7:20 గంటలకు బయటకు వచ్చాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి కుమార్తె రక్తపు మడుగులో పడి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఢిల్లీ పోలీసులు 15 బృందాలతో గాలింపు చేపట్టి, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు ద్వారకాలోని ఒక హోటల్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులు, జూదం అలవాట్ల కారణంగా కొన్ని వారాల క్రితమే మీనాను పనిలో నుండి తీసేసినట్లు పోలీసులు తెలిపారు.
