బెంగళూరు: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడు జరుగుతోంది. ఓటింగ్ ప్రక్రియ శాంతియుతంగా సాగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా కుమార్‌గంజ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై స్థానికులు విచక్షణారహితంగా దాడి చేశారు.
ఓటింగ్ జరుగుతున్న సమయంలో సువేందు తన నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామానికి వెళ్లారు. ఆయన వెంట కేవలం ఒక గన్‌మ్యాన్ మాత్రమే భద్రతగా ఉన్నారు. అక్కడ ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో వివాదం తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది. స్థానికులు ఒక్కసారిగా సువేందుపై దాడికి దిగారు. దాడులకు భయపడిన బీజేపీ అభ్యర్థి ప్రాణాలు రక్షించుకోవడానికి దిక్కుతోచని స్థితిలో పరుగులు తీశారు.
అయితే, వెంట ఉన్న ఒకే ఒక్క గన్‌మ్యాన్ కూడా గుంపును అదుపు చేయలేక అశక్తుడిగా ఉండిపోయారు. దీంతో అందినకాడికి జనం సువేందును చితకబాదారు. చివరకు దూరంగా ఉన్న అదనపు భద్రతా సిబ్బంది చేరుకుని స్థానికులను చెదరగొట్టారు. ఈ ఘటనపై కుమార్‌గంజ్ పోలీస్ స్టేషన్లో పలువురిపై కేసులు నమోదయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తలే తమపై దాడి చేశారని సువేందు సర్కార్ ఆరోపించారు.
