2016 మార్చిలో ఒక మహిళ, తాను మూడేళ్లుగా పనిచేస్తున్న ఇంట్లోని వ్యక్తితో వివాహం చేసుకుంది. వివాహమైన మరుసటి నెలలోనే, అంటే 2016 ఏప్రిల్లో ఆమెకు ఒక బిడ్డ జన్మించింది. అయితే, భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా 2016 జూలైలో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. తనకు మరియు తన బిడ్డకు నెలకు 25,000 రూపాయల భరణం ఇవ్వాలని కోరుతూ కేసు దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన విచారణా కోర్టు (Trial Court), సదరు వ్యక్తి అభ్యర్థన మేరకు డీఎన్ఏ పరీక్షకు ఆదేశించింది.
డీఎన్ఏ పరీక్ష ఫలితాల్లో, ఆ వ్యక్తి సదరు బిడ్డకు అసలైన తండ్రి కాదని శాస్త్రీయంగా ధృవీకరించబడింది. దీని ఆధారంగా, ఆ వ్యక్తి బిడ్డకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని విచారణా కోర్టు మరియు ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చాయి.
భారతీయ సాక్ష్యాధారాల చట్టం (Indian Evidence Act) సెక్షన్ 112 ప్రకారం.. వివాహ బంధంలో ఉన్న కాలంలో పుట్టిన బిడ్డను చట్టబద్ధమైన సంతానంగా పరిగణించినప్పటికీ, డీఎన్ఏ పరీక్ష ద్వారా అది అబద్ధమని నిరూపితమైతే ఆ నిబంధన వర్తించదని కోర్టులు తెలిపాయి. ఈ నేపథ్యంలో, నిన్న ఈ అప్పీలును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.
సుప్రీంకోర్టు తీర్పు సారాంశం: న్యాయమూర్తులు తమ తీర్పులో ఇలా పేర్కొన్నారు: “ఒక బిడ్డకు సదరు వ్యక్తి జీవసంబంధిత తండ్రి (Biological Father) కాదని డీఎన్ఏ పరీక్ష ద్వారా శాస్త్రీయంగా నిరూపితమైన తర్వాత, అతడిని భరణం చెల్లించమని బలవంతం చేయలేము. చట్టబద్ధమైన వివాహ సమయంలో బిడ్డ జన్మించినప్పటికీ, డీఎన్ఏ నివేదిక ఫలితమే అంతిమమైనది. ఈ కేసులో డీఎన్ఏ ఫలితాలను అంగీకరించినందున, మహిళ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ను కొట్టివేస్తున్నాము.”
బిడ్డ సంక్షేమంపై కీలక ఆదేశం: అయినప్పటికీ, ఆ బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న న్యాయమూర్తులు.. బిడ్డ విద్య, పౌష్టికాహారం మరియు ప్రాథమిక అవసరాలను పర్యవేక్షించి, అవసరమైన సహాయాన్ని అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించారు.
