చిక్కమగళూరు: ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా చిక్కమగళూరులో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ఒక ఏటీఎం కేంద్రంలో మొదలైన వీరిద్దరి పరిచయం, ప్రేమగా మారి.. చివరకు కులాలను అధిగమించి పెళ్లి వరకు దారితీసింది.
అవును, ఏటీఎంలో కలిసిన ఈ జంట కులాల కట్టుబాట్లను దాటి సప్తపది తొక్కారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారం పొంది, ఎస్సీ (SC) సామాజిక వర్గానికి చెందిన సావిత్రి మరియు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సచిన్.. చిక్కమగళూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
అసలేం జరిగిందంటే? గతంలో ఒకరోజు సావిత్రి డబ్బు తీసుకోవడానికి ఏటీఎంకు వెళ్లారు. అదే సమయంలో సచిన్ తన ఖాతాలో డబ్బు జమ చేయడానికి అక్కడికి వచ్చారు. ఆ సమయంలో సావిత్రి ఏటీఎం మెషీన్ నుండి డబ్బు తీయడానికి ఇబ్బంది పడుతుండగా, సచిన్ ఆమెకు సహాయం చేశారు. ఆ కృతజ్ఞతతో ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. అక్కడ మొదలైన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాజాగా ఇరు కుటుంబాలను ఒప్పించి, బౌద్ధ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వివాహంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
