ఒక్కోసారి ₹2,500 లావాదేవీ దాని విలువ కంటే చాలా ఖరీదైనదిగా మారుతుంది. ఏడాదికి ₹80 లక్షల భారీ ఆదాయం కలిగిన 36 ఏళ్ల మహిళా ప్రొఫెషనల్ తన డేటింగ్ అనుభవంపై చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నళిని ఉనగర్ అనే యూజర్ ఈ విషయాన్ని ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు.
ఆమె పోస్ట్ ప్రకారం.. ఒక మ్యాచ్ మేకింగ్ సర్వీస్ ద్వారా పరిచయమైన వ్యక్తితో సదరు మహిళ వరుసగా మూడుసార్లు డేటింగ్‌కు వెళ్లింది. మొదటి రెండుసార్లు బిల్లును ఆ వ్యక్తే చెల్లించాడు. అయితే మూడవసారి బిల్లు ₹5,000 రాగా, దానిని ఇద్దరూ సమానంగా పంచుకుందామని (Splitting the bill) అతను అడిగాడు. ఆమె తన వంతు ₹2,500 చెల్లించి, చిరునవ్వుతో అక్కడి నుండి వచ్చేసింది.
మరుసటి రోజే ఆమె మ్యాచ్ మేకర్‌కు ఫోన్ చేసి ఈ సంబంధం వద్దని తెగేసి చెప్పింది. “నేను అతనితో కొనసాగలేను. ఇది డబ్బు గురించి కాదు. నేను బాగానే సంపాదిస్తాను. ఆ బిల్లును పదిసార్లు నేనే చెల్లించగలను. కానీ నా కోసం డబ్బు ఖర్చు చేయడం విలువైనదా కాదా అని అతను లెక్కలు వేసుకుంటున్నట్లు నాకు అనిపించింది. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తితో నా జీవితాన్ని గడపలేను” అని ఆమె పేర్కొంది.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు: ఈ పోస్ట్ నెటిజన్లను రెండు వర్గాలుగా విడదీసింది. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు దీనిని ‘ద్వంద్వ నీతి’ (Hypocrisy) అని విమర్శిస్తున్నారు.
- సమర్థించే వారు: “ఆమె తన ప్రమాణాలకు కట్టుబడి ఉంది. బిల్లు కట్టడం అనేది సెకండరీ, ఒకరిని అర్థం చేసుకోవడమే ముఖ్యం” అని కొందరు వ్యాఖ్యానించారు.
- విమర్శించే వారు: “₹80 లక్షలు సంపాదిస్తూ ₹2,500 కట్టడానికి ఇబ్బంది పడే మహిళ భవిష్యత్తులో ఎలాంటి మద్దతు ఇస్తుంది? 36 ఏళ్ల వయసులో ఇలాంటి చిన్న విషయాలకు పంతం పడితే మంచి సంబంధం దొరకడం కష్టం” అని ఎద్దేవా చేశారు.
మరికొందరు ‘సమానత్వం’ (Equality) గురించి మాట్లాడుతూ.. “మహిళలు తమకు లాభం కలిగినప్పుడు మాత్రమే సమానత్వం కోరుకుంటారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నామని చెబుతూనే, బిల్లు షేర్ చేయమంటే ఫీల్ అవుతారు. ఇది ఒక రకమైన మానసిక యుద్ధంలా ఉంది” అని ఘాటుగా స్పందించారు.
