రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుండి ఉద్వాసనకు గురైన రాఘవ్ చడ్డా, ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి, మరో ఏడుగురు ఆప్ ఎంపీలతో కలిసి బిజెపిలో చేరారు. రాజ్యసభలో ఆప్‌కు ఉన్న 10 మంది ఎంపీల్లో 7 మంది (2/3 వంతు కంటే ఎక్కువ) బిజెపిలో విలీనం కావాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద షాక్ ఇచ్చింది.
గతంలో తాను తీవ్రంగా వ్యతిరేకించిన బిజెపి తీర్థం పుచ్చుకున్న రాఘవ్ చడ్డాను చూసి ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఒకప్పుడు ఆయన మాటలు విని, ‘ఇలాంటి నాయకుడు కావాలి’ అని కొనియాడిన జనం.. ఇప్పుడు ఆయన వేసిన అడుగును చూసి, ‘ఈయన కూడా అందరిలాంటి స్వార్థ రాజకీయ నాయకుడే’ అని పెదవి విరుస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఇప్పుడు తాను చేరిన బిజెపి గురించి గతంలో రాఘవ్ చడ్డా చేసిన హీనమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆయన అన్న మాటలు ఇలా ఉన్నాయి:
- భారతీయ ‘జాహిల్’ పార్టీ: ఒక వీడియోలో రాఘవ్ చడ్డా మాట్లాడుతూ.. “బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ ‘జాహిల్’ (మూర్ఖుల) పార్టీ. బిజెపి గూండాల పార్టీ” అని నిప్పులు చెరిగారు.
- నేరగాళ్లకు అడ్డా: అమెరికా వంటి దేశాల్లో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే పోలీసులు పట్టుకుని జైల్లో వేస్తారని, కానీ భారతదేశంలో అలాంటి వారు బిజెపిలో చేరుతారని రాఘవ్ ఎద్దేవా చేశారు.
- మహిళల భద్రత: ఐరోపా దేశాల్లో ఎవరైనా మీ తల్లిని లేదా సోదరిని వేధిస్తే వారిని జైలుకు పంపుతారని, కానీ హిందుస్థాన్‌లో అలాంటి వారు బిజెపిలోకి వెళ్తారని వ్యాఖ్యానించారు.
- విద్యపై విమర్శలు: బిజెపి ఎప్పటికీ మీ కోసం పాఠశాలలు లేదా కళాశాలలను నిర్మించదని, ఎందుకంటే బిజెపికి నిరక్షరాస్యులైన గూండాల సైన్యం కావాలని ఆయన చురకలు అంటించారు.
- నిరుద్యోగం: నిరుద్యోగంపై బిజెపి ఎలాంటి ప్రణాళికలు తీసుకురాదని, ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే వారికి గూండాలు ఎలా దొరుకుతారని రాఘవ్ చడ్డా విమర్శించిన పాత వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
