వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ సమయంలో జరిగిన కాల్పుల ఘటన, ఇరాన్ యుద్ధం విషయంలో తన నిర్ణయాన్ని మార్చలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శనివారం స్పష్టం చేశారు. ఈ ఘటనకు ప్రస్తుత యుద్ధానికి సంబంధం లేదని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ విషాదకర భద్రతా వైఫల్యం తర్వాత వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్ యుద్ధంలో విజయం సాధించకుండా ఈ ఘటన నన్ను అడ్డుకోలేదు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం దీనికి యుద్ధంతో సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు” అని అన్నారు. అయితే, దర్యాప్తు సంస్థలు నిందితుడి ఉద్దేశ్యాన్ని విచారిస్తున్నాయని, అతడిని ఒక ‘లోన్ వోల్ఫ్’ (ఒంటరిగా దాడికి పాల్పడే వ్యక్తి) అని ట్రంప్ అభివర్ణించారు.
నిందితుడి గుర్తింపు: కాల్పులకు పాల్పడిన వ్యక్తిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన కోల్ టోమస్ అలెన్ (31)గా గుర్తించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిని పట్టుకునే సమయానికి అతడి వద్ద పలు ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
అలెన్ మేనిఫెస్టోలో భయంకరమైన వివరాలు: కాల్పులకు సుమారు 10 నిమిషాల ముందు కోల్ అలెన్ తన కుటుంబానికి ట్రంప్ వ్యతిరేక మేనిఫెస్టోను పంపినట్లు అధికారులు గుర్తించారు. అందులో తనను తాను “ఫ్రెండ్లీ ఫెడరల్ అస్సాస్సిన్” (స్నేహపూర్వక సమాఖ్య హంతకుడు)గా అభివర్ణించుకున్నాడు. ట్రంప్ ప్రభుత్వ అధికారులను హతమార్చడమే తన ఉద్దేశ్యమని అందులో రాసినట్లు ‘ది పోస్ట్’ నివేదించింది.
“అణచివేతకు గురైనప్పుడు మౌనంగా ఉండటం క్రైస్తవ లక్షణం కాదు; అది అణచివేసేవారికి సహకరించడమే అవుతుంది. ఈ ప్రభుత్వంలోని నేరగాళ్ల వల్ల వేధింపులకు గురవుతున్న వారెందరో ఉన్నారు. వారి కోసం పోరాడటమే నా మార్గం” అని అలెన్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నాడు.
భద్రతా వైఫల్యంపై ఎద్దేవా: వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో భద్రత ఏమాత్రం లేదని అలెన్ ఎద్దేవా చేశాడు. “నేను అనేక ఆయుధాలతో హోటల్లోకి వెళ్లినా ఒక్కరు కూడా నన్ను ముప్పుగా భావించలేదు. భద్రత అంతా హోటల్ బయట నిరసనకారులపైనే ఉంది. ఒకవేళ ఎవరైనా ఒక రోజు ముందే హోటల్లో చెక్-ఇన్ అయితే ఏం జరుగుతుందో ఎవరూ ఆలోచించలేదు. ఈ స్థాయి అసమర్థత ఆశ్చర్యకరంగా ఉంది” అని రాశాడు.
అంతేకాకుండా, “నేను అమెరికన్ పౌరుడిని కాకుండా, ఒక ఇరాన్ ఏజెంట్నై ఉంటే.. ఇక్కడికి ఏకంగా ‘మా డ్యూస్’ (M2 బ్రౌనింగ్ మెషిన్ గన్)ను తీసుకువచ్చేవాడిని. ఎవరూ కనిపెట్టలేకపోయేవారు” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. (గమనిక: ‘మా డ్యూస్’ అనేది అమెరికా సైన్యంలో సుదీర్ఘకాలంగా వాడుకలో ఉన్న అత్యంత శక్తివంతమైన మెషిన్ గన్).
నేపథ్యం: అలెన్ తన తల్లిదండ్రుల వద్ద ఉన్న రెండు హ్యాండ్గన్లు మరియు ఒక షాట్‌గన్‌ను ఉపయోగించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇతను “ది వైడ్ అవేక్స్” అనే బృందంతో సంబంధం కలిగి ఉన్నాడని, గతంలో కాలిఫోర్నియాలో జరిగిన నిరసనల్లో కూడా పాల్గొన్నాడని తెలుస్తోంది. అలెన్ ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశాడు.
