రోడ్డుపై నిలబడ్డారని కాల్పులు: డెలివరీ బాయ్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు; ఢిల్లీ పోలీసు ఘాతుకం!

ఢిల్లీలో ఒక హెడ్ కానిస్టేబుల్ అమానుషంగా ప్రవర్తించాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన చిన్నపాటి వాగ్వాదంలో కులం పేరుతో దూషిస్తూ, అతి సమీపం నుండి జరిపిన కాల్పుల్లో 21 ఏళ్ల పాండవ్ కుమార్ అనే ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రాణాలు కోల్పోగా, అతని స్నేహితుడు కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు.

అసలేం జరిగింది? పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు పాండవ్ కుమార్ మరియు అతని స్నేహితుడు కృష్ణ ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో జాఫర్‌పూర్ కలాన్ గ్రామంలోని రోడ్డుపై నిలబడి ఉన్నారు. తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుక ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో వారు అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో రోడ్డుకు అవతలి వైపు నివసించే నీరజ్ అనే వ్యక్తి కిందకు వచ్చి వారితో గొడవకు దిగాడు.

కులం పేరుతో దూషణలు.. తూటా దూసుకెళ్లి: నీరజ్ మద్యం మత్తులో ఉన్నాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గొడవ జరుగుతున్న సమయంలో వారు ఏ కులానికి చెందిన వారని నీరజ్ ఆరా తీశాడని, వారు బిహార్‌కు చెందిన వారని తెలియగానే కులం పేరుతో దూషిస్తూ తన వద్ద ఉన్న తుపాకీతో పాండవ్ కుమార్ ఛాతిలోకి కాల్చాడని పాండవ్ తల్లి మీనా దేవి వాపోయారు. తూటా పాండవ్ ఛాతి నుండి దూసుకుపోయి వెనుక కూర్చున్న కృష్ణ పొట్టలోకి వెళ్ళింది.

వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, పాండవ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం కృష్ణ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

కుటుంబానికి పెద్ద దిక్కు: మరణించిన పాండవ్ కుమార్ ఆ కుటుంబానికి ఏకైక ఆధారమని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తన కొడుకును పొట్టనబెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లి డిమాండ్ చేస్తోంది.

పరారీలో నిందితుడు: నిందితుడు నీరజ్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని సమాచారం. అయితే పోలీసులు మాత్రం నిందితుడు కానిస్టేబుల్ అనే విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు హర్యానాలోని రోహ్తక్ జిల్లాకు చెందినవాడని, గత 15 ఏళ్లుగా ఇక్కడ ఒంటరిగా నివసిస్తున్నాడని వెల్లడించారు.


Posted

in

by

Tags: