టెహ్రాన్: ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ వారసుడిగా పగ్గాలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) జీవించే ఉన్నారా లేదా అన్న సందేహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌లోని పవిత్ర నగరం మషాద్ (Mashhad)లో బయటపడిన ఒక భారీ గోడ చిత్రం (Mural) ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది.
మషాద్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ఆవిష్కరించిన ఈ భారీ పెయింటింగ్‌లో, అప్పటికే మరణించిన ఇరాన్ ప్రముఖ నాయకుల చిత్రాలు ఉన్నాయి. ఇందులో అయతొల్లా ఖొమేనీ, అలీ ఖమేనీ, ఖాసిం సులైమానీ మరియు ఇబ్రహీం రైసీల చిత్రాలతో పాటు మొజ్తబా ఖమేనీ చిత్రాన్ని కూడా చేర్చారు.
కేవలం మరణించిన నాయకుల గౌరవార్థం వేసిన చిత్రాల వరుసలో, ప్రస్తుత నేత మొజ్తబా ఫోటో ఉండటం గమనార్హం. దీనితో ఆయన అప్పటికే మరణించారని లేదా ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందనే వార్తలు ఇరాన్ రాజకీయ వర్గాల్లో దావాగ్నిలా వ్యాపిస్తున్నాయి.
