లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక ఆసక్తికర వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినులతో ఆయన ముచ్చటిస్తున్న సమయంలో ఒక విద్యార్థిని ఇచ్చిన సమాధానానికి రాహుల్ గాంధీ కూడా ఆశ్చర్యపోయి నవ్వుకున్నారు.
అసలేం జరిగింది? రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలోని గార్గి కాలేజీని సందర్శించి విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థినిని ఉద్దేశించి ఆయన ఒక గంభీరమైన ప్రశ్న వేశారు. “నీ జీవితంలో నువ్వు చేసిన అత్యంత రిస్కీ (ప్రమాదకరమైన/సాహసోపేతమైన) పని ఏమిటి?” అని రాహుల్ అడిగారు.
దీనికి ఆ విద్యార్థిని తడుముకోకుండా.. “కాంగ్రెస్ పార్టీలో చేరడం” అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం విన్న వెంటనే హాల్లోని వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. రాహుల్ గాంధీ కూడా ముసిముసి నవ్వులు చిందిస్తూ.. “ఓకే, ఇది నిజంగా రిస్కే.. చాలా పెద్ద రిస్క్” అంటూ సరదాగా స్పందించారు. దీనితో అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా తేలికపడింది.
‘జెన్-జి’ మహిళలే దేశానికి నాయకులు: ఈ సందర్భంగా రాహుల్ గాంధీ విద్యార్థినులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘జెన్-జి’ (Gen-Z) తరానికి చెందిన మహిళలే భవిష్యత్తులో దేశానికి నాయకత్వం వహిస్తారని, వారికోసం అన్ని ద్వారాలు తెరిచి ఉంచడం అందరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లోనే ఉందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. పురుషుల కంటే మహిళలే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత తమ రాష్ట్రాల్లో పోషించిన కీలక పాత్రలను ఆయన ప్రశంసించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ దీని ద్వారా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేయాలనుకుంటోందని, ఇది ‘దక్షిణ మరియు ఉత్తర భారతం మధ్య యుద్ధానికి’ దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని అడగ్గా.. రాజకీయాల్లో, కార్పొరేట్ రంగంలో మరియు దేశంలోని ప్రధాన సంస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
