3000 ఏళ్ల నాటి భారతీయ టెక్నాలజీ: ఏసీ, కరెంటు అక్కర్లేదు.. ఈ ‘టెర్రకోట’ పద్ధతితో మీ ఇల్లు ఏసీలా చల్లబడటం ఖాయం!

వేసవి తీవ్రత సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంట్లోకి అడుగుపెడితే సెగలు, బయట ఎండలు.. కూలర్లు కూడా సరిపోని పరిస్థితి. అయితే ‘టెర్రకోట కూలింగ్’ అనే ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఈ సమస్యకు ఒక గొప్ప వరప్రసాదంగా మారుతోంది.

సైంటిఫిక్ అమెరికన్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, ఈ టెర్రకోట కూలింగ్ టెక్నాలజీ సుమారు 3,000 సంవత్సరాల కంటే పురాతనమైనది. దీని మూలాలు కాంస్య యుగం నాటి సింధు లోయ నాగరికత కంటే ముందటివని నివేదికలు చెబుతున్నాయి. పురాతన కాలంలో నీటిని నిల్వ చేయడానికి టెర్రకోట పాత్రలను వాడేవారు, ఈ పద్ధతి నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంది. ఇది విద్యుత్ అవసరం లేకుండానే ఉష్ణోగ్రతను 50 శాతం వరకు తగ్గించగలదు.

టెర్రకోట అంటే ఏమిటి? టెర్రకోట అనేది సహజమైన బంకమట్టితో తయారు చేయబడిన ఒక రకమైన మట్టి పాత్రల వర్గం. మట్టికి ఒక ఆకారాన్ని ఇచ్చి, తక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ‘టెర్రకోట’ అనే పదం ఇటాలియన్ భాష నుండి వచ్చింది, దీని అర్థం ‘కాల్చిన మట్టి’. మట్టిలోని ఇనుము ధాతువు వల్ల ఇది ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఇందులో ఉండే సూక్ష్మ రంధ్రాలు తేమను పీల్చుకుని, నెమ్మదిగా బయటకు వదలడం వల్ల సహజంగానే చల్లదనం ఏర్పడుతుంది.

టెర్రకోట కూలింగ్ ఎలా పనిచేస్తుంది? బయట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటినప్పుడు, ఇంటి పైకప్పు (స్లాబ్) ద్వారానే అత్యధిక వేడి లోపలికి వస్తుంది. టెర్రకోట కూలింగ్ పద్ధతిలో, ఇంటి పైకప్పు వేసేటప్పుడు కాంక్రీట్ పొరల మధ్య ఖాళీగా ఉన్న మట్టి పాత్రలను బోర్లించి అమర్చుతారు. పైకప్పు పూర్తయిన తర్వాత, ఈ పాత్రలు స్లాబ్ లోపల శూన్య ప్రదేశాలను (Hollow spaces) సృష్టిస్తాయి. ఈ ఖాళీ ప్రదేశం ఒక ఇన్సులేషన్‌లా పనిచేసి, సూర్యరశ్మి ద్వారా వచ్చే వేడిని కింద ఉన్న గదులకు చేరకుండా అడ్డుకుంటుంది.

అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయ నిపుణుడు ఆదిత్య ప్రద్యుమ్న ప్రకారం.. మట్టి పాత్రకు తేమ తగిలినప్పుడు, ఆ నీరు ఆవిరవుతూ పరిసరాల్లోని వేడిని గ్రహిస్తుంది. ఇది మన శరీరానికి చెమట పట్టినప్పుడు చల్లదనం ఎలా వస్తుందో సరిగ్గా అలాగే పనిచేస్తుంది.

సరసమైన మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం: ఆధునిక వాస్తుశిల్పులు ఇప్పుడు ఈ పురాతన పద్ధతిని పెద్ద పెద్ద కార్యాలయాలు మరియు ఇళ్ల నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారు. ఏసీల వాడకం వల్ల బయట వాతావరణం మరింత వేడెక్కుతుంది, కానీ టెర్రకోట కూలింగ్ వల్ల ఎటువంటి కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ పద్ధతి మధ్యతరగతి కుటుంబాలకు ఒక ఉత్తమ ఎంపిక.


Posted

in

by

Tags: