ప్రముఖ నటి మరియు ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ షెనాజ్ ట్రెజరీ ఏప్రిల్ 27న మిజోరం రాష్ట్ర విశిష్టతలను వివరిస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అక్కడి సామాజిక వాతావరణం, భద్రత మరియు క్రమశిక్షణను చూసి ఆమె ఫిదా అయిపోయారు.
షెనాజ్ తన పోస్ట్‌లో ఇలా రాశారు: “వేసవి సెలవుల కోసం వెతికే వారికి ఈ వీడియో పంపండి. అసలు ఈ రాష్ట్రం ఇండియాలోనే ఉందా అనిపిస్తుంది. హారన్ల గోల లేదు, రోడ్లపై చెత్త కనిపించదు, అర్థరాత్రి కూడా మహిళలకు పూర్తి రక్షణ ఉంటుంది. ఇక్కడ మహిళలే వ్యాపారాలను నడిపిస్తున్నారు, ట్రాఫిక్ అంతా క్రమశిక్షణతో ఒకే లైన్లో సాగుతుంది. వావ్! ఇది కూడా నా ఇండియా.”
మిజోరాన్ని ‘బెస్ట్ స్టేట్’ అని ఎందుకు పిలుస్తున్నారు? మనం మన నగరాల్లో రోజూ ఎదుర్కొనే ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం వంటివి మిజోరంలో మచ్చుకైనా కనిపించవని షెనాజ్ పేర్కొన్నారు. ఆమె దృష్టిలో ఆ రాష్ట్రం ప్రత్యేకతలివే:
- హారన్ లేని రోడ్లు: ట్రాఫిక్ ఎంతున్నా సరే, ఒక్కరంటే ఒక్కరు కూడా హారన్ కొట్టరు. ఐజ్వాల్ వీధుల్లో స్కూటీపై ప్రయాణిస్తూ.. నిశ్శబ్దంగా సాగిపోయే ట్రాఫిక్ చూసి షెనాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
- పాదచారులకు ప్రాధాన్యత: మనం రోడ్డు దాటాలంటే వాహనాలు ఆగుతాయని ఊహించలేం. కానీ ఐజ్వాల్‌లో జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులు కనిపిస్తే వాహనాలు వాటంతట అవే ఆగి వారికి దారి ఇస్తాయి.
- మహిళల రాజ్యం: షెనాజ్ ప్రకారం, అక్కడ ప్రతి వ్యాపారంలోనూ, దుకాణాల్లోనూ మహిళలే కనిపిస్తారు. వ్యవస్థనంతా వారే సమర్థవంతంగా నడిపిస్తున్నారు.
- ఇంటి పనులు చేసే భర్తలు: ఇక్కడ పురుషులు తమ భార్యల వృత్తిగత ఎదుగుదలకు తోడ్పడుతూ.. ఇంట్లో వంట చేయడం, శుభ్రం చేయడం వంటి పనులను బాధ్యతగా తీసుకుంటారు.
- చెత్త లేని నగరం: మిజోరం వీధులు అత్యంత శుభ్రంగా ఉంటాయి. కనీసం ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కూడా రోడ్డుపై కనిపించదు. ప్రజలు తమ వ్యర్థాలను బాధ్యతగా పారవేస్తారు.
- అత్యున్నత భద్రత: అర్థరాత్రి 12 గంటలకు కూడా ఒంటరిగా తిరగొచ్చు. ఎంత భద్రత అంటే.. ప్రజలు తమ ఇంటి తలుపులకు తాళం కూడా వేయరని షెనాజ్ తెలిపారు. కొన్ని గ్రామాల్లో షాపు యజమాని లేకపోయినా, వస్తువులపై ధర రాసి ఉంటుంది. ప్రజలే ఆ డబ్బును ఒక డబ్బాలో వేసి వస్తువులను తీసుకుంటారు.
- అక్షరాస్యత: చాలామంది కేరళను అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా భావిస్తారు. కానీ మిజోరంలో 98 శాతం అక్షరాస్యత ఉందని షెనాజ్ గుర్తు చేశారు.
- ఆతిథ్యం: పర్యాటకులను మిజోరం ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తారని, ఇక్కడ అందరూ స్నేహపూర్వకంగా ఉంటారని ఆమె ముగించారు.
