ముంబై (మహారాష్ట్ర): ముంబైలోని మీరా రోడ్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున పహల్గామ్ తరహాలో ఒక భయంకరమైన దాడి జరిగింది. కల్మా పఠించలేదనే నెపంతో, ఒక భవనం వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న రాజ్‌కుమార్ మిశ్రా మరియు సుబ్రోతో రమేష్ సేన్లపై ఒక వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని 31 ఏళ్ల జైబ్ జుబైర్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. దాడి జరిగిన కేవలం గంటన్నర వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, దాడికి పాల్పడక ముందు నిందితుడు ఆ సిబ్బంది పేర్లు మరియు వారి మతాన్ని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
అసలేం జరిగింది? పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముంబైలోని నయా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వోకార్డ్ హాస్పిటల్ వెనుక భాగంలోని అస్మితా గ్రాండ్ మాన్షన్ వద్ద రాజ్‌కుమార్ మిశ్రా, సుబ్రోతో సేన్ సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నారు. ఆ సమయంలో నిందితుడు జైబ్ జుబైర్ అన్సారీ అక్కడికి చేరుకుని, గార్డులతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అకస్మాత్తుగా కత్తి తీసి వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో రాజ్‌కుమార్ మిశ్రా తీవ్రంగా గాయపడగా, సుబ్రోతో సేన్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఉగ్రవాద కోణంపై విచారణకు డిమాండ్: దాడికి ముందు నిందితుడు సెక్యూరిటీ గార్డులను ‘కల్మా’ పఠించమని బలవంతం చేశాడని శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితుడికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలో లోతుగా విచారణ జరపాలని, పుల్వామా వంటి దారుణాలు మళ్లీ జరగకుండా చూడాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.
