ఇస్లామాబాద్: మధ్యప్రాచ్య దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల ఏర్పడిన చమురు సంక్షోభంపై భారత్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు సాగుతుంటే.. అటు పాకిస్థాన్ పెట్రోలియం శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ మాత్రం భారత చమురు నిల్వ సామర్థ్యాన్ని ఆకాశానికెత్తారు.
అదే సమయంలో, తమ దేశంలో కనీసం ఒక్క రోజు అవసరాలను తీర్చే వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రం కూడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘సమా టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశ చమురు సంక్షోభంపై స్పందించిన అలి, కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ దుస్థితి: “ప్రస్తుతం మా వద్ద కేవలం 15-18 రోజులకు సరిపడా వాణిజ్య ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. చమురు విక్రయ కంపెనీల వద్ద కూడా మరో 20-21 రోజులకు సరిపడా నిల్వలు ఉండవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి మా వద్ద ఒక్క రోజుకు సరిపడా ‘వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రం’ (Strategic Petroleum Reserve) కూడా లేదు” అని ఆయన వాపోయారు.
భారత్ సామర్థ్యంపై ప్రశంసలు: ఇదే సందర్భంలో భారతదేశ వ్యూహాత్మక చమురు నిల్వ సామర్థ్యం గురించి మాట్లాడుతూ.. “భారత్ వద్ద 60 నుండి 70 రోజుల డిమాండ్‌ను తీర్చగల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక్క సంతకం చేస్తే చాలు, ఆ చమురు అంతా మార్కెట్లోకి విడుదలవుతుంది” అని ఆయన కొనియాడారు.
వ్యూహాత్మక నిల్వ కేంద్రం అంటే ఏమిటి? రోజువారీ అవసరాలతో సంబంధం లేకుండా, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు లేదా సరఫరా నిలిచిపోయినప్పుడు దేశం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రతి దేశం విడిగా భారీ భూగర్భ చమురు నిల్వలను నిర్మించుకుంటుంది. వీటిని అత్యవసర సమయాల్లో మాత్రమే వాడుకుంటారు.
- భారత్ స్థితిగతులు: ప్రస్తుతం భారతదేశంలో కర్ణాటకలోని మంగళూరు, పాదూరు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భారీ భూగర్భ చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి.
- సామర్థ్యం: వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 53.3 లక్షల మెట్రిక్ టన్నులు (సుమారు 36.92 మిలియన్ బ్యారెల్స్). ఇది దేశం యొక్క 60 నుండి 70 రోజుల చమురు అవసరాలను తీర్చగలదు.
