అది 2016 సంవత్సరం. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ అనే చిన్న పట్టణంలో, ఒక మూసి ఉన్న గదిలో 15 ఏళ్ల బాలిక అసాధారణమైన ‘అమెరికన్ కల’ కన్నది. ఆ అమ్మాయే హర్షిత అరోరా. కేవలం తన లాప్టాప్ ముందే గంటల తరబడి గడుపుతూ, స్కూలుకు వెళ్లడం మానేసి, కుటుంబ వేడుకలకు దూరంగా ఉంటూ తను నిర్మించుకున్న ప్రపంచం.. ఏళ్ల తర్వాత ఆమెను సిలికాన్ వ్యాలీకి చేర్చింది.
ప్రస్తుతం 24 ఏళ్ల హర్షిత, ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ స్టార్టప్ యాక్సిలరేటర్ అయిన ‘వై కాంబినేటర్’ (Y Combinator) లో అతి పిన్న వయస్కురాలైన జనరల్ పార్ట్నర్లలో ఒకరు. సుందర్ పిచాయ్, సత్యా నాదెళ్ల వంటి వారు ఉన్నత చదువుల ద్వారా ఎదిగితే, హర్షిత మాత్రం స్కూల్, కాలేజీ డిగ్రీల వంటి సంప్రదాయ మార్గాలను వదిలేసి తనకంటూ ఒక ప్రత్యేక బాటను వేసుకుంది.
జీవితాన్ని మార్చేసిన నిర్ణయం
2002లో జన్మించిన హర్షిత చిన్నప్పటి నుంచి చదువులో క్లాస్ ఫస్ట్. అయితే 9వ తరగతి చదువుతుండగా, “నాకు ఇక స్కూలుకు వెళ్లడం ఇష్టం లేదు.. నాకు కంప్యూటర్ల మీద తప్ప దేనిమీద ఆసక్తి లేదు” అని తన తండ్రి రవీందర్ సింగ్ అరోరాకు తేల్చి చెప్పేసింది. ఇండియన్ స్కూళ్లలో జరిగే ‘బట్టీ పద్ధతి’ (రోట్ లెర్నింగ్) తనకు అర్థరహితంగా అనిపించిందని ఆమె అంటుంది.
తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా వినకుండా తన గదిలోనే ఉండిపోయి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఫేస్బుక్ కథాంశంతో వచ్చిన ‘ది సోషల్ నెట్వర్క్’ సినిమా చూసిన తర్వాత, తను ఒక కంపెనీ స్థాపకురాలు (Founder) కావాలని 13 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకుంది.
విజయాల పరంపర
- 2016: బెంగళూరులోని సేల్స్‌ఫోర్స్‌లో ఒక నెల శిక్షణ పొందింది.
- 2017: ఎంఐటి (MIT) నిర్వహించే ‘లాంచ్ ఎక్స్’ అనే ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్‌కు ఎంపికై అమెరికా వెళ్ళింది.
- 2018: తన మొదటి యాప్ ‘క్రిప్టోకరెన్సీ పోర్ట్‌ఫోలియో ట్రాకర్’ను విడుదల చేసింది. ఇది యాపిల్ యాప్ స్టోర్‌లో టాప్ పెయిడ్ యాప్‌లలో ఒకటిగా నిలిచింది.
- 2020: భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘రాష్ట్రీయ బాల పురస్కారం’ అందుకుంది.
- 2021: తన ఫిన్‌టెక్ స్టార్టప్ ‘AtoB’ కోసం వై కాంబినేటర్ ద్వారా నిధులు పొందింది. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం సుమారు 800 మిలియన్ డాలర్లకు చేరుకుంది.
తండ్రి గర్వం.. తల్లి జ్ఞాపకం
సహారన్పూర్లో ఉన్న తన తండ్రికి ఆమె చేసే టెక్నాలజీ పనులు పూర్తిగా అర్థం కాకపోయినా, ఆమె సాధించిన ఎదుగుదల చూసి గర్వపడుతున్నారు. “ఆమె చిన్నతనంలో నా ఒడిలో ఆడుకునేది.. ఆ చిన్నారిని నేను చాలా మిస్ అవుతున్నాను” అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి జస్వీందర్ కౌర్ తన కూతురు ఇష్టంగా తినే వంటకాలను గుర్తు చేసుకుంటూ, ఆమె అంకితభావం చూసి ఆశ్చర్యపోతుంటారు.
యువతకు హర్షిత ఇచ్చే సలహా
2025 మార్చిలో వై కాంబినేషన్లో విజిటింగ్ పార్ట్నర్గా చేరిన హర్షిత, ఏప్రిల్ 6న జనరల్ పార్ట్నర్గా బాధ్యతలు చేపట్టింది. యువతకు ఆమె ఇచ్చే సందేశం ఒక్కటే: “ప్రపంచం వేగంగా మారుతోంది. కొత్త టెక్నాలజీలతో అప్డేట్ అవ్వండి, లేదంటే మీరు వెనుకబడిపోతారు.”
అయితే అందరూ తనలాగే కాలేజీ మానేయాలని ఆమె అనడం లేదు. “చాలా మందికి కాలేజీ అవసరం. అక్కడ మీ భాగస్వాములను కనుగొనవచ్చు. నాకు ఒక ప్లాన్ ఉంది కాబట్టి నేను ఆ బాటను ఎంచుకున్నాను” అని ఆమె స్పష్టం చేసింది.
