వైభవ్ సూర్యవంశీ వైపు కన్నెత్తి చూసినందుకు కైల్ జేమీసన్‌కు బీసీసీఐ గుణపాఠం నేర్పింది, ఈ శిక్షను విధించింది.

వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించిన కైల్ జేమీసన్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు తీసుకుంది.

శుక్రవారం (మే 1) రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జేమీసన్ వేసిన ఓవర్‌లో రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఫోర్ కొట్టాడు. ఆ మరుసటి బంతికే జేమీసన్ అతడిని బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన ఆనందంలో జేమీసన్ అతిగా ప్రవర్తిస్తూ వైభవ్ ముఖం దగ్గరకు వెళ్లి అరుస్తూ అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో బీసీసీఐ స్పందించింది.

జేమీసన్‌పై బీసీసీఐ చర్యలు

ఐపీఎల్ అధికారిక ప్రకటన ప్రకారం, జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1 ఉల్లంఘనకు పాల్పడినందుకు జేమీసన్‌కు ఒక డిమెరిట్ పాయింట్ విధించడమే కాకుండా తీవ్రంగా హెచ్చరించారు.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.5 ప్రకారం.. “ప్రత్యర్థి ఆటగాడిని కించపరిచేలా భాషను వాడటం, చర్యలు లేదా సైగలు చేయడం ద్వారా వారిని రెచ్చగొట్టడం” నేరం. ఈ ఘటన మొదటి ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో జరిగింది. జేమీసన్ తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రెఫరీ ఈ శిక్షను ఖరారు చేశారు.

RR vs DC మ్యాచ్ ఎలా సాగింది?

ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఛేదించింది.

  • ఢిల్లీ బ్యాటింగ్: కేఎల్ రాహుల్ (75), పాతుమ్ నిస్సాంక (62) మెరుపు అర్ధశతకాలతో పునాది వేయగా, చివర్లో నితీష్ రాణా (33), ఆశుతోష్ శర్మ (25 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్) జట్టును గెలిపించారు. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అతిపెద్ద ‘ఛేజింగ్’.
  • రాజస్థాన్ బ్యాటింగ్: అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (90), డోనోవన్ ఫెరీరా (47 నాటౌట్) అదరగొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.

ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోగా, రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.



Posted

in

by

Tags: