ఇన్‌స్టాగ్రామ్ వీడియో చూసి సొంత వైద్యం; పసుపు సప్లిమెంట్లతో లివర్ దెబ్బతిని 57 ఏళ్ల మహిళ ఆసుపత్రి పాలు!

నేటి కాలంలో ఆరోగ్యానికి సంబంధించిన ఏ సందేహం వచ్చినా మనం మొదట సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కొందరు చెప్పే సలహాలను పాటించి సొంతంగా మందులు వాడే వారు నేడు కోకొల్లలు. అయితే అటువంటి ధోరణి ఎంత ప్రమాదకరమో చెప్పడానికి అమెరికాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం.

వాపులు తగ్గించుకోవడానికి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరు షేర్ చేసిన వీడియో చూసి 57 ఏళ్ల కేటీ మోహన్ పసుపు సప్లిమెంట్లను (Turmeric Supplements) తీసుకోవడం ప్రారంభించారు. కానీ కొన్ని వారాల్లోనే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి, వికారం, నీరసం రావడంతో ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు చేయగా, పసుపులోని ‘కుర్కుమిన్’ (Curcumin) అనే పదార్ధం అతిగా శరీరంలోకి చేరడం వల్ల కాలేయ ఎంజైమ్‌ల స్థాయి పెరిగి, లివర్ దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రతిరోజూ చాలా నీళ్లు తాగినప్పటికీ మూత్రం ముదురు రంగులో వస్తోందని ఆమె ‘ఎన్‌బీసీ’ (NBC) వార్తా సంస్థకు తెలిపారు.

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్న మాట వాస్తవమే. వంటల్లో వాడే తక్కువ మోతాదు పసుపు సురక్షితం. కానీ సప్లిమెంట్ల రూపంలో అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు మరియు ఇతర ఆరోగ్య ఇబ్బందులు తప్పవు.

పసుపు అతిగా తీసుకుంటే ఏమవుతుంది?
  • కడుపు నొప్పి: ఖాళీ కడుపుతో అధికంగా పసుపు తీసుకోవడం వల్ల వికారం, విరేచనాలు లేదా అజీర్తి కలగవచ్చు.
  • మూత్రపిండాల్లో రాళ్లు: పసుపులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి.
  • ఐరన్ లోపం: పసుపు మోతాదు మించితే శరీరంలో ఐరన్ గ్రహించే శక్తి తగ్గుతుంది, ఇది రక్తహీనతకు దారితీయవచ్చు.
  • తలనొప్పి మరియు కళ్లు తిరగడం: ఎక్కువ కాలం పసుపు సప్లిమెంట్లు వాడటం వల్ల కొందరికి మైగ్రేన్ లేదా తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి.
  • లివర్‌పై ఒత్తిడి: కుర్కుమిన్ అతిగా చేరడం వల్ల లివర్ ఎంజైమ్‌లు అసాధారణంగా పెరిగి కాలేయంపై ఒత్తిడి పడుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
  • రోజూ వంటల్లో అర టీస్పూన్ నుండి ఒక టీస్పూన్ పసుపు వాడటం సురక్షితం.
  • సప్లిమెంట్లు తీసుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు, రక్తం గడ్డకట్టకుండా మందులు వాడేవారు, లివర్ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • నీరసం లేదా ఇతర అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాడటం ఆపి డాక్టర్‌ను సంప్రదించాలి.

Posted

in

by

Tags: