షార్జా నుండి చెన్నై చేరుకున్న ‘ఎయిర్ అరేబియా’ విమానంలో నేటి తెల్లవారుజామున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విమానం రన్‌వేపై ల్యాండ్ అయి, ట్యాక్సీ వే గుండా పార్కింగ్ ఏరియాకు నెమ్మదిగా వెళ్తుండగా ఒక ప్రయాణికుడు అకస్మాత్తుగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి బయటకు దూకేశాడు.
విమానం పూర్తిగా ఆగకముందే ప్రయాణికుడు చేసిన ఈ సాహసంతో పైలట్ వెంటనే గ్రౌండ్ సెక్యూరిటీకి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన CISF అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నివేదికల ప్రకారం.. ప్రయాణ సమయంలో సదరు వ్యక్తి అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. విమానంలో అతను రెండుసార్లు వాంతులు చేసుకున్నాడు. వాంతులు వచ్చేటప్పుడు కలిగే అసౌకర్యం, ఆందోళన కారణంగానే కంగారులో అతను తలుపు తెరిచి బయటకు దూకి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
రన్‌వే మూసివేత:
ఈ అవాంఛనీయ ఘటన కారణంగా చెన్నై విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వేను తెల్లవారుజామున 03:23 నుండి 04:23 వరకు మూసివేశారు. ఆ సమయంలో రావాల్సిన విమానాలను సెకండరీ రన్‌వేకు మళ్లించారు. ఈ ఘటనలో విమానానికి గానీ, ఇతర ప్రయాణికులకు గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు.
సదరు ప్రయాణికుడు తమిళనాడులోని పుదుక్కోట్టై నివాసి అని అనధికార సమాచారం. విమానయాన భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అతడిని లోతైన విచారణ మరియు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.
