చెప్పకుండా బైక్ తీసుకెళ్లాడని కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన తండ్రి!

బెంగళూరులో ఒక ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు చెప్పకుండా బైక్ తీసుకువెళ్లాడనే కోపంతో ఒక తండ్రి కన్నకొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటన కుమారస్వామి లేఅవుట్ పరిధిలోని ప్రగతిపురలో చోటుచేసుకుంది. 19 ఏళ్ల కొడుకు మల్లికార్జున్ తండ్రికి చెప్పకుండా బైక్ తీసుకువెళ్లడమే ఈ వివాదానికి కారణం.

దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి ఆనంద్ దొడ్డమని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో తండ్రీకొడుకులిద్దరూ తీవ్రంగా గాయపడగా, వారిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

ఏం జరిగింది?
45 ఏళ్ల ఆనంద్ దొడ్డమని తాపీ పని (Masonry) చేస్తుండగా, అతని 19 ఏళ్ల కుమారుడు మల్లికార్జున్ టైల్స్ పని చేసేవాడు. వీరిద్దరూ సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మే 1న కార్మిక దినోత్సవం కావడంతో ఇద్దరికీ పనికి సెలవు ఉంది. ఆ రోజు సాయంత్రం మల్లికార్జున్ తన స్నేహితులను కలవడానికి తండ్రి బైక్ తీసుకుని వెళ్లాడు. అయితే బైక్ తీసుకునేటప్పుడు తండ్రికి చెప్పకపోవడమే పెద్ద తప్పిదంగా మారింది.

రాత్రి మల్లికార్జున్ ఇంటికి తిరిగి రాగానే, ఆనంద్ దొడ్డమని అతనిపై విరుచుకుపడ్డాడు. “నాకు చెప్పకుండా బైక్ ఎందుకు తీసుకెళ్లావు?” అని నిలదీశాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవ పెద్దదైంది. ఆ ఆవేశంలో ఆనంద్ పక్కనే బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను కొడుకుపై పోసి నిప్పు అంటించాడు.

మల్లికార్జున్‌కు మంటలు అంటుకోవడంతో అతను గట్టిగా కేకలు వేశాడు. ఈ క్రమంలో మంటలు తండ్రి ఆనంద్‌కు కూడా అంటుకున్నాయి. వీరిద్దరి అరుపులు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం విక్టోరియా ఆసుపత్రిలోని బర్నింగ్ వార్డులో చేర్పించారు.

మల్లికార్జున్ 40 శాతం కాలిన గాయాలతో పోరాడుతుండగా, తండ్రి ఆనంద్ 18 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కుమారస్వామి లేఅవుట్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: