చిక్కబళ్లాపూర్: జిల్లాలో ఇటీవల కారులో మహిళా సజీవ దహనమైన మిస్టరీ కేసులో ఇప్పుడు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్తను వదిలి రావడానికి ప్రియురాలు నిరాకరించిందనే కోపంతో ఆమెను హత్య చేసి, కారుతో సహా తగులబెట్టిన ప్రియుడు.. ఆ తర్వాత తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
ఘటన నేపథ్యం:
దేవనహళ్లికి చెందిన సుజాత (35) ఈ ఘటనలో హత్యకు గురైన దురదృష్టవంతురాలు. నిందితుడు రామాంజినప్ప ఈ దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. సుజాతపై ఉన్న మోజుతో రామాంజినప్ప నాలుగు నెలల క్రితమే తన భార్యకు విడాకులు ఇచ్చాడు. అదేవిధంగా సుజాత కూడా తన భర్తను వదిలేసి తనతో వచ్చేయాలని అతను నిరంతరం ఒత్తిడి చేసేవాడు.
కారులోనే సజీవ దహనం:
ఘటన జరిగిన రోజున, భర్తను వదిలి రావడం సాధ్యం కాదని సుజాత ఖచ్చితంగా చెప్పేసింది. దీంతో ఆగ్రహానికి గురైన రామాంజినప్ప, దొడ్డబళ్లాపూర్ తాలూకా జింకే బచ్చహళ్లి వద్ద కారులోనే సుజాతపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను నాశనం చేసే ఉద్దేశంతో, మృతదేహం ఉన్న కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి అక్కడి నుండి పరారయ్యాడు.
దర్యాప్తులో తేలిన నిజం:
కాలిపోయిన కారు యజమాని వివరాలను సేకరించిన పోలీసులకు, అది మారసంద్రకు చెందిన సురేష్ అనే వ్యక్తిదని తెలిసింది. సురేష్ దగ్గర నుండి రామాంజినప్ప ఆ కారును తీసుకువెళ్లాడనే క్లూ దొరకడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
అయితే, పోలీసులు రామాంజినప్ప కోసం గాలిస్తుండగా.. బెంగళూరులోని బిడది సమీపంలో రైల్వే ట్రాక్ పైన అతని మృతదేహం లభ్యమైంది. హత్య చేసిన తర్వాత పశ్చాత్తాపంతోనో లేదా పోలీసులకు చిక్కుతాననే భయంతోనో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు.
