మీరు తప్పక చూడాల్సిన భారతదేశంలోని ఐదు యూరోపియన్ శైలి పర్యాటక ప్రాంతాలివే!

European-Style Destinations: 2026 విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. జూన్ నెలలో పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేముందు లేదా వర్షాకాలం మొదలయ్యేలోపు విహారయాత్రకు వెళ్లాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. మరికొందరు విదేశీ ప్రయాణం చేయాలని ఆశపడుతుంటారు.

అయితే, ఆ చింత వద్దు! ఈసారి యూరోపియన్ శైలి పర్యాటక ప్రాంతాలను భారతదేశంలోనే చూసేలా ప్లాన్ చేసుకోండి. సాధారణంగా యూరోప్ వాతావరణం ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుంది. అక్కడి కొండలు, పర్వతాలు, బీచ్‌లు, షాపింగ్ వీధులు, భవన నిర్మాణ శైలి, ఆహారం, సంస్కృతి మరియు చరిత్ర పర్యాటకులను కట్టిపడేస్తాయి. యూరోప్ వెళ్లడానికి అంతగా ఖర్చు చేయలేకపోతే, మన దేశంలోనే ఆయా ప్రాంతాలను పోలి ఉండే ప్రదేశాలను సందర్శించవచ్చు. అవి ఎక్కడ ఉన్నాయి, వాటిని యూరోపియన్ ప్రాంతాలతో ఎందుకు పోలుస్తారు అనే సమాచారం ఇక్కడ ఉంది.

  1. ఉత్తరాఖండ్‌లోని ‘ఔలి’ (Auli)
    ఔలిని ఉత్తరాఖండ్‌లోని స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ఇక్కడి ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన వాలులు, శీతాకాలపు క్రీడల ఆకర్షణ ఈ పోలికకు కారణం. గర్వాల్ హిమాలయాల్లో ఉన్న ఈ ప్రాంతం స్కీయింగ్ (Skiing) కు ప్రసిద్ధి. ఇక్కడి చల్లని పర్వత గాలి, మంచు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తాయి. శీతాకాలం మరియు వేసవిలో కూడా ఇక్కడికి వెళ్లవచ్చు.
  2. పుదుచ్చేరిలోని ‘చిన్న ఫ్రాన్స్’ (Little France)
    పుదుచ్చేరిలోని ఒక ప్రాంతాన్ని ‘లిటిల్ ఫ్రాన్స్’ అని పిలుస్తారు. భారతదేశపు ఆగ్నేయ తీరంలో ఉన్న ఈ ప్రాంతం సుదీర్ఘకాలం ఫ్రెంచ్ పాలనలో ఉంది. 1954లో ఇది అధికారికంగా భారత్‌లో భాగమైంది. అందుకే ఇక్కడి కళలు, వాస్తుశిల్పం, సంస్కృతిలో ఫ్రాన్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి బోగన్‌విల్లా వీధులు, కెఫెలు, చర్చిలు చూస్తుంటే ఫ్రాన్స్‌లోనే ఉన్నామా అన్న భ్రమ కలుగుతుంది.
  3. స్కాట్లాండ్‌ను తలపించే ‘షిల్లాంగ్’ (Shillong)
    మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ను ‘తూర్పు స్కాట్లాండ్’ అని పిలుస్తారు. ఇది పచ్చని కొండలు, జలపాతాలు, అద్భుతమైన వాస్తుశిల్పం మరియు స్థానిక సంస్కృతికి పేరుగాంచింది. ఇక్కడి ఉమియం సరస్సు, ఎలిఫెంట్ జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి.
  4. వెనిస్‌ను తలపించే ‘కొచ్చి’ (Kochi)
    కేరళలోని కొచ్చిలో ఉన్న బ్యాక్ వాటర్స్ (Backwaters) అందాల వల్ల దీనిని ‘వెనిస్’ అని పిలుస్తారు. చైనీస్ చేపల వలలు, వలస కాలం నాటి భవనాలు, కాలువలు, ప్రసిద్ధ చర్చిలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. మట్టంచేరి ప్యాలెస్‌ను ‘డచ్ ప్యాలెస్’ అని కూడా పిలుస్తారు, ఇక్కడ అందమైన వర్ణచిత్రాలు ఉంటాయి. మెరైన్ డ్రైవ్ మరియు జ్యూయిష్ సినగోగ్ కూడా చూడదగ్గ ప్రదేశాలు.
  5. కూర్గ్ – భారతదేశపు మరో స్కాట్లాండ్ (Coorg)
    కర్ణాటకలోని కొడగు (కూర్గ్)ను కూడా ‘భారతదేశపు స్కాట్లాండ్’ అని పిలుస్తారు. ఇక్కడి పొగమంచుతో నిండిన లోయలు, కాఫీ తోటలు, దట్టమైన అడవులు ప్రపంచ ప్రసిద్ధి. మడికేరి కోట, అబ్బే జలపాతాలు, రాజా సీట్, దుబారే ఏనుగుల శిబిరం, తలకావేరి వంటి ప్రాంతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి

Posted

in

by

Tags: