చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని కూడగట్టుకోవడానికి తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ AIADMKతో తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం లీక్ అయ్యింది. అయితే, ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న ఎడప్పాడి పళనిస్వామి (EPS) వర్గం, విజయ్ పార్టీకి భారీ షాక్ ఇచ్చేలా కొన్ని షరతులు విధించింది.
మద్దతు ఇచ్చే విషయంలో ఎడప్పాడి వర్గం పెట్టిన ప్రధాన షరతు ఏమిటంటే.. మొదటి రెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి తమకే (AIADMK) ఇవ్వాలని, దాంతో పాటు స్పీకర్ పదవిని కూడా తమ పార్టీకే కేటాయించాలని ఖచ్చితంగా తెలిపారట. ఈ షరతులకు అంగీకరిస్తేనే కూటమి గురించి ఆలోచిస్తామని ఏఐఏడీఎంకే వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇది TVK నాయకత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది.
ఏఐఏడీఎంకే పెట్టిన ఈ ఆకస్మిక షరతులతో TVK ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికార పంపిణీలో ఎదురైన ఈ చిక్కుముడిపై విజయ్ నేతృత్వంలో అత్యవసర సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. ఒకవైపు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే పట్టుదల ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడంపై TVKలో సంశయం నెలకొంది. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది తేలడంలో ఈ ప్రతిష్టంభన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది.
