చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి రాజకీయ ఉత్కంఠ క్షణక్షణానికి పెరుగుతూనే ఉంది.
పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల్లో పార్టీ అధ్యక్షుడు విజయ్ ఘనవిజయం సాధించగా, మొత్తం 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన తమిళగ వెట్రి కళగం రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది.
ఈ విజయోత్సాహంతో తమిళనాడు వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు పేలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా పండుగ చేసుకుంటున్నారు. గెలిచిన అభ్యర్థులందరూ వెంటనే పణైయూర్లోని పార్టీ కార్యాలయానికి రావాలని విజయ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం వారందరితో విజయ్ సమావేశమై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో విజయ్ ‘టీవీకే అసెంబ్లీ పక్ష నేత’గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అలాగే, పార్టీ తరపున ఎవరెవరు మంత్రులుగా ఉండాలనే దానిపై జాబితాను సిద్ధం చేస్తున్నారు.
TVK సాధించిన అద్భుతాలు:
పార్టీ పెట్టిన కేవలం రెండేళ్లలోనే 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసిన టీవీకే, వందకు పైగా స్థానాల్లో గెలిచి చారిత్రక రికార్డు సృష్టించింది. ఇందులో విశేషాలు ఇవే:
- యువతకు ప్రాధాన్యత: 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న 23 మంది యువ అభ్యర్థులు విజయం సాధించారు.
- సామాజిక సమతుల్యత: గెలిచిన వారిలో 26 మంది దళితులు, 12 మంది మహిళా అభ్యర్థులు ఉండటం గమనార్హం.
- అత్యల్ప మెజారిటీ: తిరుపత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
- డిపాజిట్లు: ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా పార్టీ డిపాజిట్ కోల్పోకపోవడం విశేషంగా పరిగణించబడుతోంది.
చారిత్రక ఘనత:
కేవలం రాజకీయ నేపథ్యం ఉన్నవారికే కాకుండా సమాజంలోని వివిధ వర్గాలకు విజయ్ అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఒక గర్భిణీ స్త్రీ, ఆటో డ్రైవర్, డ్రైవర్ కుమారుడు, దివ్యాంగుడు వంటి సామాన్యులు టీవీకే తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఇది నిజంగా ఒక చారిత్రక విజయమని అటు రాజకీయ వర్గాలు, ఇటు సామాన్య ప్రజలు విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
