న్యూఢిల్లీ: వరకట్నం కోసం అత్తారింట్లో హత్యకు గురవ్వడానికి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయవద్దని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
భర్త ప్రేమ, ఆదరణ కోసం ఎన్నో కలలతో ఆడపిల్లలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. మంచి విద్యావంతులు, స్వతంత్రంగా జీవించగల సామర్థ్యం ఉన్నవారు కూడా వరకట్నం పేరుతో వేధింపులకు గురవుతున్నారు. పెళ్లికి ముందు తమకేమీ వద్దని చెప్పే అత్తమామలు, పెళ్లయ్యాక కట్నం కోసం ఒత్తిడి చేయడం ప్రారంభిస్తారని కోర్టు పేర్కొంది. తమ కుమార్తె కాపురం నిలబడాలనే తాపత్రయంతో తల్లిదండ్రులు వారి కోర్కెలు తీర్చాల్సిన దుస్థితికి నెట్టబడుతున్నారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
‘వరకట్నాన్ని వివాహానికి ఒక షరతుగా మార్చే ఏ యువకుడైనా తన విద్యను, దేశాన్ని మరియు స్త్రీత్వాన్ని అవమానించినట్లే’ అని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక వరకట్న హత్య కేసులో నిందితుడైన భర్తకు అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధితురాలి తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు అత్యధికంగా జరుగుతున్నాయని ధర్మాసనం ఎత్తిచూపింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారని, ఆపై కట్నం కోసం వారిని క్రూరంగా వేధిస్తున్నారని పేర్కొంది. ఇటువంటి వేధింపుల కారణంగా ఆడపిల్లలు ఆత్మహత్యలకు పాల్పడటం లేదా హత్యకు గురవ్వడం వంటి పరిస్థితులు నెలకొన్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
