భారతీయ రైల్వేలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న పాత రిజర్వేషన్ వ్యవస్థను మార్చాలని నిర్ణయించారు. మరి ఈ కొత్త వ్యవస్థ ఎప్పటి నుండి అమల్లోకి రానుంది?
గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కొత్త రైళ్లు, విద్యుదీకరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి ఎన్నో పనులు జరిగాయి. ఇప్పుడు టిక్కెట్ బుకింగ్ విధానంలో కూడా మార్పులు చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న పాత ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్’ (PRS)ను పూర్తిగా ఆధునీకరిస్తున్నారు.
డిజిటల్ వ్యవస్థ వైపు అడుగులు:
పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ స్థానంలో ఇప్పుడు కొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా టిక్కెట్ బుకింగ్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 80 శాతం బుకింగ్లు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. కౌంటర్ల వద్దకు వెళ్లి టిక్కెట్లు కొనేవారి సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలోనే రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది?
40 ఏళ్ల నాటి పాత వ్యవస్థ స్థానంలో రానున్న ఈ కొత్త డిజిటల్ విధానం ఈ ఏడాది ఆగస్టు 1 నుండి అమలులోకి రానుంది. ఈ మార్పు సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రస్తుత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ 1986లో ప్రారంభమైంది. అప్పటి నుండి చిన్న చిన్న మార్పులతో ఇది కొనసాగుతోంది. అయితే, ప్రస్తుత డిజిటల్ యుగంలో పాత వ్యవస్థ వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే ఆధునిక సాంకేతికతతో ఈ వ్యవస్థను పునర్నిర్మించారు. దీనివల్ల టిక్కెట్ బుకింగ్ వేగం పెరుగుతుంది.
ఏఐ (AI) సాంకేతికత వినియోగం:
కొత్త వ్యవస్థలో కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించనున్నారు. దీనివల్ల టిక్కెట్ కన్ఫర్మేషన్ మరియు బుకింగ్ వివరాలపై మరింత కచ్చితమైన సమాచారం లభిస్తుంది. పాత పద్ధతి నుండి కొత్త డిజిటల్ విధానానికి మారే క్రమంలో బుకింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకూడదని మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు.
సబ్సిడీల కొనసాగింపు:
కొత్త విధానాలు అమల్లోకి వస్తున్నప్పటికీ, పాత వ్యవస్థలోని కొన్ని ప్రయోజనాలు అలాగే కొనసాగుతాయి. ముఖ్యంగా ప్రయాణికులకు ఇచ్చే సబ్సిడీలను ప్రభుత్వం కొనసాగిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు సుమారు 60 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని సబ్సిడీ రూపంలో అందించింది.
