మదర్స్ డే 2026: ప్రతి ఏటా మే నెల రెండో ఆదివారం నాడు మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10, 2026న మదర్స్ డే జరుపుకోనున్నాము. ఈ ప్రత్యేక సందర్భంలో, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఒక అద్భుతమైన తల్లి-కూతుళ్ల జోడి గురించి మీకు పరిచయం చేయబోతున్నాం.
ఈ జోడి వేర్వేరు తరాలలో ఒకే దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడి చరిత్ర సృష్టించింది. వారే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్ మరియు ఆమె తల్లి అన్నే-మేరీ గార్త్.
14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం
కిమ్ గార్త్ కేవలం 14 ఏళ్ల చిన్న వయసులోనే ఐర్లాండ్ మహిళల జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో టీ20 అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. ఐర్లాండ్ తరపున కిమ్ 34 వన్డేల్లో 448 పరుగులు చేసి, 23 వికెట్లు పడగొట్టింది. అలాగే 51 టీ20ల్లో 762 పరుగులు చేయడంతో పాటు 42 వికెట్లు తీసింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ఫిబ్రవరి 2021లో ఆమెను ‘దశాబ్దపు ఉత్తమ ఐర్లాండ్ మహిళా క్రికెటర్’ అవార్డు వరించింది.
అయితే 2020లో కిమ్ తన మకాంను ఆస్ట్రేలియాకు మార్చింది. ‘క్రికెట్ విక్టోరియా’తో ఒప్పందం కుదుర్చుకుని, తన కష్టంతో 2022లో ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె కంగారూ జట్టు తరపున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతూ, ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా కొనసాగుతోంది.
అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తల్లి
కిమ్ తల్లి అన్నే-మేరీ గార్త్ కూడా ఐర్లాండ్ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆమె 1988-89 మధ్య కాలంలో 12 వన్డే మ్యాచ్‌లు ఆడి, 6 వికెట్లు తీయడంతో పాటు 14 పరుగులు చేశారు. క్రికెట్ కేవలం కిమ్ మరియు ఆమె తల్లికే పరిమితం కాలేదు. ఆమె తండ్రి జోనాథన్ గార్త్ కూడా ఐర్లాండ్ తరపున ఆడారు. ఆమె ఇద్దరు సోదరులు కూడా క్రికెట్‌తో సంబంధం కలిగి ఉన్నారు. అంటే, ఆ కుటుంబం మొత్తం క్రికెట్ మైదానంలో తన వంతు సహకారాన్ని అందిస్తోంది.
