కేరళ, అడూర్: పతనంతిట్టలో 28 ఏళ్ల యువతికి జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమె స్పృహ తప్పిన తర్వాత అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పొరుగునే ఉండే ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు వినోద్‌ను నిన్న రాత్రి అడూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలను మొబైల్లో రికార్డ్ చేసిన నిందితుడు, వాటిని బయటపెడతానని బెదిరిస్తూ యువతిని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. భర్తకు దూరంగా ఉంటున్న యువతిని లక్ష్యంగా చేసుకుని వినోద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
మొదటిసారిగా గత ఫిబ్రవరి 15న ఈ దారుణం జరిగింది. యువతికి జ్యూస్ ఇచ్చి మత్తులోకి దించిన తర్వాత ఆమె నగ్న దృశ్యాలను చిత్రీకరించాడు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించి ఆ తర్వాత కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే, యువతి ఈ విషయాన్ని నిందితుడి భార్యకు తెలియజేసింది. దీనిపై ఆగ్రహం చెందిన నిందితుడు గత నెల 28న యువతిని ట్యాంకర్ లారీలో ఎక్కించి గాయపరిచినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
