మ్యాజిక్ ఫిగర్ దాటి బహుదూరం.. విజయ్‌కు 145 మంది ఎమ్మెల్యేల మద్దతు! కొత్తగా మద్దతు తెలిపిన ఏఐఏడీఎంకే రెబల్స్ మరియు ఏఎంఎంకే ఎమ్మెల్యే

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఏఐఏడీఎంకే (AIADMK)లోని ఒక వర్గం మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

ఏఐఏడీఎంకే మాజీ మంత్రి సి.వి. షణ్ముగం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు టి.టి.వి. దినకరన్ పార్టీ (AMMK)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ కూడా అసెంబ్లీలో టీవీకే (TVK)కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనితో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వారి సంఖ్య 145కు చేరింది (120+24+1= 145). దీనివల్ల అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గడం విజయ్‌కు చాలా సులభమైంది.

ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఎడప్పాడి పళనిస్వామి (EPS) వైపు 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా, తిరుగుబాటు వర్గం (రెబల్స్) వైపు 24 మంది ఉన్నారు. జిల్లా కార్యదర్శులను తమ వైపు తిప్పుకోవడానికి ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈపీఎస్ ప్రయత్నించారని, అందుకే తాము ఆయనను వ్యతిరేకించామని సి.వి. షణ్ముగం స్పష్టం చేశారు. అన్నాడీఎంకేను చీల్చాలనే ఉద్దేశ్యం తమకు లేదని, పార్టీ భవిష్యత్తు గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నామని ఎస్.పి. వేలుమణి తెలిపారు. డీఎంకే మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని ఈపీఎస్ చూశారని, ఆ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాలేదని ఆయన వివరించారు. పార్టీని కాపాడుకోవడానికి కొత్త కూటమి అవసరమని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, ఎన్డీయే (NDA) మిత్రపక్షమైన ఏఎంఎంకే (AMMK) ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ అసెంబ్లీలో టీవీకేకు మద్దతు ప్రకటించడం కలకలం రేపింది. కామరాజ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మద్దతు లేఖ సృష్టించారని అంతకుముందు టి.టి.వి. దినకరన్ టీవీకేపై ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. తాను ఎన్డీయేలోనే కొనసాగుతానని దినకరన్ చెబుతున్నప్పటికీ, తన పార్టీ ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన ఇంకా స్పందించలేదు.


Posted

in

by

Tags: