చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్, ఈరోజు వేళచ్చేరిలోని విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్‌తో భేటీ అయ్యారు. వీసీకే మద్దతు తెలిపిన తర్వాత ఇద్దరు నేతల మధ్య జరిగిన మొదటి ప్రత్యక్ష భేటీ ఇది.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి విజయ్‌కు తిరుమావళవన్ భారత రాజ్యాంగ పీఠిక (Preamble) ఉన్న చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. భేటీ అనంతరం తిరుమావళవన్ విలేకరులతో మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి విజయ్ గారు ఎడప్పాడి పళనిస్వామిని కూడా నేరుగా కలవాలని నేను కోరాను” అని తెలిపారు.
అయన ఇంకా మాట్లాడుతూ.. “రాబోయే విశ్వాస పరీక్షలో ఆయన విజయం సాధించాలని మేము ఆకాంక్షించాము. అన్ని పార్టీల నాయకులను, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లను వారి నివాసాలకే వెళ్లి కలిసి కొత్త చరిత్ర సృష్టించినందుకు విజయ్ను అభినందించాము.
అదేవిధంగా మద్దతు తెలిపిన మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహా అన్ని పార్టీల నాయకులను వారి ఇళ్ల వద్దే కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఏఐఏడీఎంకే (AIADMK) లో జరుగుతున్న అంతర్గత సమస్యల గురించి ప్రశ్నించగా.. “దానిపై నేను వ్యాఖ్యానించలేను. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించాలన్నదే మా కోరిక” అని అన్నారు.
తిరుమావళవన్ కొనసాగిస్తూ.. “నా గతం గురించి ఆయనతో పంచుకున్నాను. ఈ కార్యాలయంలోనే నేను 15 ఏళ్లకు పైగా నివసిస్తున్నానని ఆయనకు చెప్పాను” అని వివరించారు. ఈ భేటీ తమిళ రాజకీయాల్లో సామరస్యాన్ని, సరికొత్త రాజకీయ విధానాన్ని ప్రతిబింబిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం విజయ్ వరుసగా రాజకీయ ప్రముఖులను కలుస్తున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ స్థిరత్వం బలపడుతుందని అంచనా వేస్తున్నారు.
