ఇంటి పనిమనిషికి ఇచ్చే జీతాన్ని “టైర్ 3 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల” జీతంతో పోలుస్తూ బెంగళూరుకు చెందిన ఒక ‘ఫ్రీలాన్స్ హెచ్ఆర్ కన్సల్టెంట్’ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. నెటిజన్లు అతని తీరును “సున్నితత్వం లేనిది”గా అభివర్ణిస్తూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.
తన రెసిడెన్షియల్ సొసైటీ యాప్‌లో ఆ వ్యక్తి పెట్టిన పోస్ట్ వివాదానికి కారణమైంది. తనకు ఉదయం, సాయంత్రం రెండు పూటలా వచ్చి పని చేసే వ్యక్తి కావాలని, దానికి తాను నెలకు రూ. 3,500 మాత్రమే ఇస్తానని అతను పేర్కొన్నాడు.
ఆ పోస్ట్‌లో ఇలా ఉంది: “రెండు పూటలా వచ్చే పనిమనిషి కావాలి. ఉదయం 7:30 నుండి 10 గంటల మధ్య, సాయంత్రం 4 గంటల సమయంలో రావాలి. ఆదివారం సెలవు ఇస్తే రూ. 3,500 జీతం ఇస్తాను. ఒకవేళ ఆదివారం కూడా వస్తే అదనంగా ఇస్తాను. ఒక పూటకే రూ. 3,500 అడిగే వారిని పంపకండి. ఒక పూటకు రూ. 2,500 అనేది సరైన రేటు.”
అంతటితో ఆగకుండా, తానూ నిర్ణయించిన రూ. 3,500 ఎలా సరైనదో వివరిస్తూ ఒక వింత లెక్కను కూడా చెప్పాడు. “నేను రేట్లు పెంచాలని అనుకోవడం లేదు. సొసైటీలోని నివాసితులందరూ పనిమనుషుల రేట్లను నియంత్రించాలని కోరుతున్నాను. సాధారణంగా యాప్‌లలో గంటకు రూ. 100 ఉంటుంది. నెలకు 25 రోజులు పని చేస్తే అది రూ. 2,500 అవుతుంది. ఒకవేళ ఆమె రోజుకు 10 గంటలు లేదా 10 ఇళ్లలో పని చేస్తే నెలకు రూ. 25,000 సంపాదిస్తుంది. ఇది బీపీఓ (BPO)లో పని చేసే నిపుణుల కంటే మరియు టైర్ 3 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు సర్వీస్ కంపెనీల్లో ట్యాక్స్ పోగా వచ్చే జీతం కంటే ఎక్కువ” అని అతను వాదించాడు.
ఈ పోస్ట్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. శ్రమను తక్కువ చేసి చూడటం “అగౌరవంగా” ఉందని కొందరు, 70 వేలకు పైగా అద్దె కట్టే ఫ్లాట్లలో ఉంటూ పనిమనుషుల దగ్గర ఇంత “చిల్లరగా” ప్రవర్తించడం ఏమిటని మరికొందరు విమర్శిస్తున్నారు.
రెడ్డిట్ (Reddit) వేదికగా ‘litterboxobserver’ అనే హ్యాండిల్ ద్వారా 3 రోజుల క్రితం షేర్ చేయబడిన ఈ పోస్ట్ వేల సంఖ్యలో వ్యూస్ మరియు కామెంట్లను సంపాదించింది.
