తెలంగాణ: ఒక కుటుంబ కలహం విషాదాంతానికి దారితీసింది. అయితే ఏళ్ల తర్వాత ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు, ఆ మహిళను తిరిగి జైలుకు పంపాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది.
భర్త మరణానికి ఆమె కారణమని కోర్టు నిర్ధారించినప్పటికీ, గతంలో విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను కేవలం ₹500 జరిమానాకు తగ్గించింది. ఆమె ఇప్పటికే ఆ జరిమానాను చెల్లించారు.
ఆ ఇంట్లో అసలేం జరిగింది?
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఒక ఆకస్మిక గొడవలో ఆ మహిళ తన భర్తపై కత్తితో దాడి చేయగా, అతను మరణించాడు. మొదట అధికారులు దీనిని ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద నమోదు చేశారు.
అయితే, విచారణ కోర్టు ఇది హత్య కాదని నిర్ధారించి, దీనిని ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ II (హత్య కాని నేరపూరిత నరహత్య) కిందకు మార్చింది. ఆ సమయంలో ఆమెకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధించింది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
చంపాలనే ఉద్దేశ్యం లేదు: డిఫెన్స్ వాదన
విచారణ సమయంలో, ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని డిఫెన్స్ తరపు న్యాయవాదులు వాదించారు. మృతుడు తన భార్యపై ముందే హింసాత్మకంగా ప్రవర్తించాడని వారు పేర్కొన్నారు.
న్యాయవాదుల కథనం ప్రకారం.. మృతుడు తన అత్తగారింటికి దిగంబరంగా వచ్చి, భార్యను మరియు ఆమె కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ గొడవ సృష్టించాడు. ఆ గొడవలో మహిళ ఆవేశంతో స్పందించిందని, అతడిని చంపాలనే ఉద్దేశ్యం ఆమెకు లేదని కోర్టుకు తెలిపారు.
మరోవైపు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు మరియు నిందితురాలి వద్ద దొరికిన కత్తి వంటి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని ప్రభుత్వం వాదించింది.
కేకలు విన్న పొరుగువారు
జస్టిస్ తిరుమల దేవి ఈడ సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ ఒక పొరుగు వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రస్తావించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ ఇంట్లో పెద్దగా అరుపులు వినిపించాయని, ఆ తర్వాత మృతుడు నొప్పితో కేకలు వేయడం విన్నానని సదరు సాక్షి తెలిపారు. అతను అక్కడికి వెళ్లేసరికి, మృతుడు మెడపై కత్తి గాయంతో పడి ఉన్నాడని చెప్పారు. ఇతర సాక్షులు కూడా గాయపడిన వ్యక్తిని చూసినట్లు ధృవీకరించారు.
వైద్య నివేదిక కీలక పాత్ర
పోస్ట్మార్టం నివేదికలో మెడ ముందు భాగంలో లోతైన గాయం ఉన్నట్లు తేలింది. ఈ గాయం వల్ల అంతర్గత కండరాలు, రక్తనాళాలు మరియు ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు నివేదించారు. కీలక అవయవాలకు తీవ్ర గాయాలు కావడమే మరణానికి కారణమని కోర్టుకు తెలిపారు.
హైకోర్టు శిక్షను ఎందుకు తగ్గించింది?
నిందితురాలికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగింది కాదని హైకోర్టు పేర్కొంది. ఘటనకు ముందు మృతుడు పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకువచ్చాడని, ఆ తర్వాత గొడవ జరిగి అతను వెళ్లిపోయి, మళ్ళీ దిగంబరంగా తిరిగి వచ్చి భార్యను, ఆమె కుటుంబాన్ని దూషించాడని కోర్టు గమనించింది.
తీవ్రమైన వాగ్వివాదం జరుగుతున్నప్పుడు, ఆవేశంలో (“in a spur of anger”) ఆమె ఈ పని చేసిందని జస్టిస్ తిరుమల దేవి ఈడ అభిప్రాయపడ్డారు. ఈ కేసు ఐపీసీ సెక్షన్ 300 లోని ఎక్సెప్షన్ 4 (ముందస్తు ప్రణాళిక లేకుండా, ఆకస్మిక గొడవలో జరిగే మరణం) కిందకు వస్తుందని కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను రద్దు చేసి, దానిని కేవలం ₹500 జరిమానాగా మారుస్తూ తీర్పునిచ్చింది.
