దేశంలో మనం రకరకాల సంఘటనలు చూస్తుంటాం. కొన్ని షాకింగ్‌గా ఉంటే, మరికొన్ని మనల్ని భయాందోళనకు గురిచేస్తాయి. ఇంకొన్ని మనల్ని ఆలోచింపజేస్తాయి. రెండో పెళ్లి (Second Marriage) అనేది సర్వసాధారణంగా మారిపోయిన ఈ కాలంలో, తల్లిదండ్రులు ఒంటరిగా ఉండకూడదని పిల్లలే స్వయంగా దగ్గరుండి పెళ్లిళ్లు చేస్తున్న రోజుల్లో.. తాజాగా జరిగిన ఒక ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
రెండో పెళ్లిని వ్యతిరేకించిన పెళ్లికాని కొడుకును ఒక 60 ఏళ్ల వ్యక్తి తుపాకీతో కాల్చి చంపిన ఘటన పంజాబ్‌లోని లూధియానాలో జరిగింది. భోజనం విషయంలో జరిగిన గొడవలో రిటైర్డ్ సైనికుడు సురీందర్ సింగ్ తన కుమారుడు గురుశరణ్ సింగ్ (40)ను వీధిలో వెంటాడి కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.
కొన్నేళ్ల క్రితం భార్య మరణించడంతో సురీందర్ రెండో వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే ఆయన కుమారుడు అందుకు అభ్యంతరం తెలపడం వాగ్వాదానికి దారితీసిందని పోలీసులు తెలిపారు.
సురీందర్ మరియు ఆయన కుమారుడు కలిసి నివసిస్తున్నారు. వీరిద్దరి కుమార్తెలు విదేశాల్లో ఉంటున్నారు. భోజనం సమయంలో గొడవ ముదరడంతో, సురీందర్ తన వద్ద ఉన్న డబుల్ బారెల్ తుపాకీని తీసుకుని కొడుకుపై కాల్పులు జరిపారు.
మొదట కాల్పులు లక్ష్యం తప్పాయి, ప్రాణాలు కాపాడుకోవడానికి కుమారుడు వీధిలోకి పరుగులు తీశాడు. కానీ సురీందర్ వదలకుండా కొడుకును వెంబడించి కాల్చారు. తీవ్ర రక్తస్రావంతో కొడుకు రోడ్డుపైనే పడిపోగా, సురీందర్ తిరిగి ఇంటికి వెళ్లారు.
అనంతరం లోపలి నుండి తలుపులు వేసుకుని విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. గురుశరణ్ రోడ్డుపై గాయాలతో పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా సురీందర్ అపస్మారక స్థితిలో కనిపించారు.
వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించారు. ఘటన జరిగిన సమయంలో ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారని, వారు క్రమం తప్పకుండా గొడవ పడేవారని ఇరుగుపొరుగు వారు తెలిపారు.
కుమారుడిని చంపినందుకు పోలీసులు సురీందర్పై కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు.
