ప్రసవం నార్మల్ అవుతుందా లేదా సిజేరియనా? గర్భధారణ సమయంలో దాదాపు ప్రతి మహిళా కనీసం ఒక్కసారైనా ఎదుర్కొనే ప్రశ్న ఇది. “మా కాలంలో తొమ్మిది నెలలు కష్టపడి పనులు చేశాం కాబట్టే నార్మల్ డెలివరీ అయింది, కానీ ఈ రోజుల్లో డాక్టర్లు తమ టార్గెట్లు పూర్తి చేసుకోవడం కోసం సిజేరియన్లు చేసేస్తున్నారు” అని ఇంట్లోని పెద్దలు అనడం కూడా మనం వినే ఉంటాం.
అయితే, ఈ మాట పూర్తిగా నిజం కాదు. ఈ విషయమై ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ షెఫాలీ స్పందిస్తూ.. పూర్వపు రోజుల్లో నార్మల్ డెలివరీలు అంత సాధారణంగా ఎందుకు ఉండేవి, ప్రస్తుతం సిజేరియన్ కేసులు ఎందుకు అంతగా పెరిగిపోతున్నాయో శాస్త్రీయంగా వివరించారు.
అప్పట్లో నార్మల్ డెలివరీ ఎందుకు సులభంగా ఉండేది?
తల్లి కావడం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఒక ప్రత్యేకమైన క్షణం. ప్రసవం నార్మల్ అయినా, సిజేరియన్ అయినా.. మహిళలు సమానమైన శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే మెడికల్ సైన్స్ పరంగా చూస్తే.. పూర్వకాలంలో మహిళలు శారీరక శ్రమతో కూడిన పనులలో (Physical activities) ఎక్కువగా ఉండేవారని డాక్టర్ షెఫాలీ చెప్తున్నారు. వంటింటి పనులైనా, ఇంటి పనులైనా.. వంగడం, లేవడం, కూర్చోవడం మరియు మెట్లు ఎక్కడం-దిగడం వంటివి వారి దినచర్యలో భాగంగా ఉండేవి.
మహిళలు తమ పనులన్నీ స్వయంగా చేసుకునేవారు
పూర్వపు రోజుల్లో మహిళలు ఇంటిని శుభ్రం చేసుకోవడం, వంట వండటం, పశువుల సంరక్షణ వంటి పనులన్నీ స్వయంగా చేసుకునేవారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వారు తీసుకునే ఆహారం సులభంగా జీర్ణమయ్యేది. అందుకే అప్పట్లో ప్రసవం తర్వాత కూడా మహిళలు బరువును త్వరగా తగ్గించుకోగలిగేవారు.
గర్భిణీ స్త్రీలలో బరువు ఎందుకు పెరుగుతోంది?
శారీరక శ్రమ నిరంతరం కొనసాగడం వల్లనే బరువు అదుపులో ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ నేటి కాలంలో గర్భం దాల్చగానే మహిళలు పూర్తిగా ‘బెడ్ రెస్ట్’ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. ఎక్కువ సమయం ఫోన్ చూడటం, పుస్తకాలు చదవడం, నిద్రపోవడం లేదా జంక్ ఫుడ్ తినడానికే పరిమితమవుతున్నారు. గర్భధారణ సమయంలో ఫాస్ట్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంలోకి క్యాలరీలు విపరీతంగా చేరుతున్నాయి. ఇలాంటి స్థితిలో కొద్దిపాటి వ్యాయామం చేయడానికి ప్రయత్నించినా.. అప్పటికే బరువు బాగా పెరిగిపోవడం వల్ల కాళ్లు, చేతులు నొప్పులు పెట్టడం మొదలవుతుంది.
బద్ధకంతో పెరుగుతున్న వ్యాధులు
కనీసం మెట్లు ఎక్కడం వంటి చిన్నపాటి శారీరక శ్రమ కూడా చేయకపోవడం వల్ల బరువు విపరీతంగా పెరుగుతుందని, దీనివల్ల ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్, రక్తపోటు (Blood Pressure), మధుమేహం (Diabetes) వంటి సమస్యలు వస్తున్నాయని గైనకాలజిస్ట్ తెలిపారు. ఈ కారణాల వల్లనే ప్రసవ తేదీ (Delivery date) దగ్గర పడేకొద్దీ మహిళల్లో భయం, మానసిక ఒత్తిడి (Stress) పెరిగిపోతాయి. ఫలితంగా, చివరి నిమిషంలో ఆరోగ్య పరిస్థితి విషమించకుండా వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ డెలివరీ చేయాల్సి వస్తోంది.
నార్మల్ డెలివరీ అవకాశాలను ఎలా పెంచుకోవాలి?
మహిళల్లో మారుతున్న జీవనశైలి (Lifestyle), అవసరానికి మించిన విశ్రాంతి మరియు శారీరక శ్రమ అస్సలు లేకపోవడమే సిజేరియన్లు పెరగడానికి ప్రధాన కారణాలని డాక్టర్ షెఫాలీ స్పష్టం చేశారు. గర్భధారణ సమయంలో వైద్యుల సలహాతో మహిళలు శారీరకంగా చురుగ్గా (Physically active) ఉంటూ, సరైన జీవన విధానాన్ని పాటిస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయని ఆమె సూచించారు.
