ఫిలిప్పీన్స్: సెలవులను ఆస్వాదించడానికి రిసార్ట్‌కు వెళ్లిన పర్యాటకులకు అక్కడ ఒక భయంకరమైన అనుభవం ఎదురైంది. ఫిలిప్పీన్స్‌లోని సాల్వడార్ బెనెడిక్టోలో ఉన్న ఒక రిసార్ట్ బాత్రూమ్ క్లోజెట్ (కమోడ్) లో ఒక పెద్ద పాము ప్రత్యక్షమైంది.
రిసార్ట్‌లో గది తీసుకున్న ఐదుగురు స్నేహితుల బృందం ఈ పాము బారి నుండి తృటిలో ప్రాణాలతో బయటపడింది. అడవులు, జలపాతాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ‘నార్తర్న్ నెగ్రోస్ నేచురల్ పార్క్’ సమీపంలోని రిసార్ట్‌లో ఈ ఘటన జరిగింది.
ఆ స్నేహితుల బృందంలోని ఒకరు బాత్రూమ్కు వెళ్లినప్పుడు క్లోజెట్ లోపల ఏదో అసాధారణంగా ఉండటం గమనించారు. దాంతో దానిని క్లీన్ చేయడానికి ఫ్లష్ ఆన్ చేయగా.. లోపల ఉన్న పాము ఒక్కసారిగా తల పైకెత్తి పైకి లేచింది.
హోటల్ సిబ్బంది అప్రమత్తత – సోషల్ మీడియాలో వైరల్
క్లోజెట్ నుండి పాము పైకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువకుడు వెంటనే గదిలో ఉన్న తన స్నేహితులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత వారు హోటల్ సిబ్బందిని పిలవగా, సిబ్బంది వచ్చి ఆ పామును అక్కడి నుండి సురక్షితంగా పట్టుకుని బయటకు తీసుకెళ్లారు.
ప్రస్తుతం క్లోజెట్ లోపల పడగ విప్పి నిలబడిన ఆ పాముకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు.. అది చూడటానికి ‘కింగ్ కోబ్రా’ లా ఉందని కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ ప్రాంతంలో అంతకుముందు కూడా ఇలా పాములు అప్పుడప్పుడు వస్తుంటాయని హోటల్ సిబ్బంది తెలిపారు.
