చట్టం తెలుసుకోండి: ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు ఏం చేయాలి? చట్టం ఏం చెబుతోంది?

ఏదో ఒక పొరపాటు జరిగిపోయింది అనుకోండి, లేదా ఎవరో కుట్ర పన్ని మనల్ని (వైరల్ న్యూస్) ఇరికించారని అనుకోండి… అనుకోకుండా మీ ఇంటి ముందు సైరన్ మోగిస్తూ పోలీస్ జీపు వచ్చి ఆగితే గుండె జారిపోతుంది కదూ?

చుట్టుపక్కల వాళ్ళంతా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నప్పుడు, ముఖమంతా చెమటలు పట్టి తడిసిపోవడం ఖాయం. కానీ ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది! మన రాజ్యాంగం ఉన్నదే సామాన్య ప్రజల రక్షణ కోసం. పోలీసులు మిమ్మల్ని తాకడానికి ముందే మీ చేతిలో ఎలాంటి చట్టపరమైన బ్రహ్మాస్త్రాలు ఉంటాయో తెలుసా? ఆ సమాచారం ఇక్కడ ఉంది చూడండి.

జీపు ఎక్కడానికి ముందే ఎదురు ప్రశ్న వేయండి!
పోలీసులు వచ్చి “నడువు, బండి ఎక్కు” అనగానే భయంతో ముడుచుకుపోకండి. మొదటిగా, అక్కడ గొడవ పడి పరిస్థితిని మరింత జటిలం చేసుకోకండి. అత్యంత ప్రశాంతంగా నిలబడి, “సార్, నాపై ఉన్న కేస్ ఏంటి? ఏ వారంట్ (Warrant) తెచ్చారు?” అని ధైర్యంగా అడగండి. చట్టం ప్రకారం, మీరు చేసిన నేరం ఏంటో మీకు చెప్పకుండా వారు మిమ్మల్ని తీసుకెళ్లడానికి వీల్లేదు.

అంతే కాదు, వచ్చిన అధికారి అసలైన పోలీసులా లేక నకిలీలా అని తనిఖీ చేసే అధికారం కూడా మీకు ఉంది. వారి యూనిఫాంపై నేమ్ ప్లేట్ ఉందా? ఐడీ కార్డ్ ఉందా? అని స్పష్టంగా చూడండి. సుప్రీం కోర్టు కూడా దీనిని తప్పనిసరి చేసింది.

పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాక మీ ‘సైలెన్స్ గేర్’ ఉపయోగించండి
పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన వెంటనే వారు అడిగిన దానికిల్లా తల ఊపాల్సిన అవసరం లేదు. మీకు ‘మౌనంగా ఉండే పూర్తి హక్కు’ (Right to Silence) ఉంది. “మా లాయర్ గారు వచ్చేవరకు నేను ఒక్క అక్షరం కూడా మాట్లాడను” అని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఎందుకంటే, బెదిరించి లేదా భయపెట్టి మీ చేత పోలీసులు రాయించుకునే స్టేట్‌మెంట్‌లు కోర్టు ముందు చెత్త కాగితంతో సమానం. స్టేషన్‌కు వెళ్లగానే తక్షణమే మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఒక మంచి న్యాయవాదిని (లాయర్‌ను) సిద్ధం చేయమని చెప్పండి.

24 గంటల ‘డెడ్‌లైన్’ రూల్
సినిమాల్లో చూపించినట్లు రోజులకు రోజులు మిమ్మల్ని లాకప్‌లో ఉంచే అధికారం ఏ పోలీసుకూ లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేసిన 24 గంటల లోపు (ప్రయాణ సమయాన్ని మినహాయించి) సమీపంలోని న్యాయమూర్తి (మెజిస్ట్రేట్) ముందు హాజరుపరచాల్సిందే. ఇది రాజ్యాంగం రాసిన నియమం.

ఒకవేళ లోపల ఏమైనా థర్డ్ క్లాస్ ట్రీట్‌మెంట్ ఇచ్చి గాయపరిచి ఉంటే, జడ్జ్ ముందు నిలబడినప్పుడు “సార్, చూడండి నన్ను ఎలా కొట్టారో” అని చూపించి వైద్య పరీక్షల (Medical Examination) కోసం డిమాండ్ చేయవచ్చు.

చట్టాన్ని ఉల్లంఘిస్తే పోలీసులకే భారీ జరిమానా!
ఎవరో కక్షతో మీపై అబద్ధపు కేసు పెట్టి, పోలీసులు మిమ్మల్ని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేస్తే ఊరికే వదిలిపెట్టకండి. రాజ్యాంగంలోని 21వ అధికరణ (Article 21) మనకు స్వేచ్ఛగా జీవించే హక్కును ఇచ్చింది. ఇటీవలే కర్ణాటక హైకోర్టు, ఒక అమాయకుడిని అనవసరంగా అరెస్ట్ చేసిన ఇన్‌స్పెక్టర్‌కు “నీ సొంత జీతం డబ్బుల నుండి అతనికి ₹5 లక్షల రూపాయల జరిమానా చెల్లించు” అని గట్టిగా మొట్టికాయ వేసింది.


Posted

in

by

Tags: