పోలీసుల అదుపులో ఉన్న తన ప్రియుడిని విడిపించేందుకు జార్ఖండ్‌లో ఒక ‘ప్రేయసి’ మొబైల్ టవర్ ఎక్కింది; పదిహేను రోజుల్లో మూడు ఘటనలు.

‘షోలే’ సినిమాలో హీరో వీరూ.. బసంతితో పెళ్లి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి రచ్చ చేసిన ఫిల్మీ డ్రామా మీకు గుర్తుండే ఉంటుంది. అయితే, ప్రస్తుతం జార్ఖండ్‌లో కొందరు ప్రేమికులు ఈ రీల్ లైఫ్ డ్రామాను రియల్ లైఫ్‌లో మొబైల్ టవర్లపై రీ-క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పటివరకు కేవలం నెట్‌వర్క్, సిగ్నల్స్ కోసమే ఉపయోగపడుతున్నాయని అనుకునే మొబైల్ టవర్లు.. ఇప్పుడు జార్ఖండ్‌లో ప్రేమ, మొండితనం మరియు హైడ్రామాలకు కొత్త ‘వేదికలు’గా మారుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత రెండు వారాల వ్యవధిలోనే ప్రేమ వ్యవహారాల కారణంగా మొబైల్ టవర్లు ఎక్కిన మూడు వేర్వేరు సంఘటనలు వెలుగుచూశాయి.

తాజా ఉదంతం ధన్‌బాద్ జిల్లా గోమో పరిధిలోని సిక్‌లైన్ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న తన ప్రియుడిని విడిపించాలంటూ, అతనితోనే తనకు పెళ్లి చేయాలంటూ ఒక యువతి మొబైల్ టవర్ ఎక్కి కలకలం సృష్టించింది.

బాధితురాలిని సహరియా నివాసి దేవంతి కుమారిగా గుర్తించారు. ఆమె ఇదివరకే వివాహమైన ఒక యువకుడితో ప్రేమలో ఉంది. సదరు యువకుడిని నిమియాఘాట్ పోలీసులు ఏదో ఒక కేసులో అరెస్ట్ చేశారు. ప్రియుడి అరెస్టుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి ఆదివారం మొబైల్ టవర్ ఎక్కడంతో.. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకున్నారు.

దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ హైడ్రామాలో.. తన ప్రియుడిని వెంటనే విడుదల చేయాలని, అతనితో పెళ్లి జరిపించాలని ఆ యువతి పైనుండే డిమాండ్ చేస్తూ వచ్చింది. సమాచారం అందుకున్న హరిహర్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించి, నచ్చజెప్పి ఆ యువతిని సురక్షితంగా కిందికి దించారు. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.


గిరిడీలో మరో ప్రేమికుడి రచ్చ

దీనికి ఒక రోజు ముందే గిరిడీ జిల్లా నిమియాఘాట్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ధన్‌బాద్‌లోని గోవింద్‌పూర్ నివాసి అయిన సునీల్ కుమార్ మహతో అనే యువకుడు.. తన ప్రేమికురాలితో పెళ్లి జరిపించాలంటూ మొబైల్ టవర్ ఎక్కాడు. ఆ యువకుడు దాదాపు 7 గంటల పాటు టవర్‌పైనే కూర్చుని పట్టుబట్టాడు. చివరకు పోలీసులు, స్థానికులు రంగంలోకి దిగి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి సురక్షితంగా కిందికి దించారు. సదరు యువకుడు తన స్వంత సోదరుడి మరదలితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం.


గఢ్వా జిల్లాలో 145 అడుగుల టవర్ ఎక్కిన ఉన్మాది

ఇదే తరహా సంఘటన మే మొదటి వారంలో గఢ్వా జిల్లా రంకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసదుల్లా అన్సారీ అనే యువకుడు.. తన ప్రేమికురాలికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందనే కోపంతో ఏకంగా 145 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్ ఎక్కాడు. తన ప్రేమికురాలితో పెళ్లి చేయకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు దాదాపు 9 గంటల పాటు శ్రమించి అతడిని సురక్షితంగా కిందికి దించగలిగారు.



Posted

in

by

Tags: