త్రిపుర రాజధాని అగర్తలాలో, ఫేస్బుక్ (Facebook) ద్వారా పరిచయమైన ఒక గిరిజన యువతికి ఖరీదైన ఐఫోన్ బహుమతిగా ఇస్తానని ఆశ చూపించి, హోటల్ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ప్రముఖ సోషల్ మీడియా క్రియేటర్, మొబైల్ షాప్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడితో బాధితురాలికి కొన్ని నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడిందని, కాలక్రమేణా ఇద్దరూ సోషల్ మీడియాలో నిరంతరం మాట్లాడుకునేవారని పోలీస్ అధికారి పరితోష్ దాస్ తెలిపారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆ వ్యక్తి తనను నేరుగా వచ్చి కలవాలని, అక్కడ తనకు ఖరీదైన ఐఫోన్ కొనిస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం మందులు కొనడానికి ఆ యువతి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అప్పుడు అక్కడికి లగ్జరీ బైక్‌పై వచ్చిన నిందితుడు, మొదట చెప్పిన ప్రదేశానికి కాకుండా, రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక ప్రైవేట్ హోటల్‌కు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి దీనిని తీవ్రంగా ప్రతిఘటించడంతో, ఆమెపై మృగీయంగా దాడి చేయడమే కాకుండా, ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కుని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.
ఎలాగోలా ఆ హోటల్ గది నుండి తప్పించుకున్న బాధితురాలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే నిందితుడి మొబైల్ షాప్‌నకు వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. వివాహితుడైన ఆ నిందితుడికి పిల్లలు కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన తర్వాత, అతను తన రాజకీయ రికమండేషన్లు, పట్టును ఉపయోగించి పోలీసులనే బెదిరించడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ, దానికి లొంగని పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అతడిని అధికారికంగా అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
