న్యూఢిల్లీ: పోలీసులు లేదా మహిళా పోలీసులు బస్సు, ఆటో ఛార్జీలు ఇవ్వకుండా ఉచితంగా ప్రయాణించాలనుకునే వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఒక వీడియోనే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ రోడ్‌వేస్ బస్సు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ఈ మహిళా కానిస్టేబుల్ హర్యానా పోలీసు విభాగానికి చెందినవారు కాగా, రాజస్థాన్ రోడ్‌వేస్ బస్సులో ప్రయాణిస్తున్నారు. కండక్టర్ ఆమెను టికెట్ డబ్బులు అడగగా, ఆమె ఛార్జీ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కండక్టర్ సదరు మహిళా కానిస్టేబుల్‌తో “50 రూపాయలు ఇవ్వండి” అని అనగా.. ఆమె “నేను డబ్బులు ఇవ్వను, నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళు, నేను మీ ఆఫీసర్‌తో మాట్లాడుకుంటాను” అని అనడం వినిపిస్తుంది.
ఆ వీడియోలో మహిళా కానిస్టేబుల్ “నేను ఛార్జీ ఇవ్వను” అని స్పష్టంగా చెబుతోంది. అయితే ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలని కండక్టర్ ఆమెకు పదే పదే వివరిస్తున్నాడు. దీనిపై ఆ మహిళ తాను హర్యానా పోలీస్ స్టాఫ్ అని చెప్పగా.. కండక్టర్ “ఇది రాజస్థాన్ రోడ్‌వేస్ బస్సు, హర్యానా రోడ్‌వేస్ కాదు” అని బదులిచ్చాడు. అప్పుడు ఆమె “అయితే ఏంటి, బస్సు నడిపేది హర్యానాలోనే కదా” అంటూ వాదించింది.
ఆ లేడీ కానిస్టేబుల్‌తో ఉన్న తోటి ప్రయాణికులు కూడా టికెట్ డబ్బులు ఇచ్చేయమని నచ్చజెప్పినప్పటికీ ఆమె ఎవరి మాట వినలేదు. పైగా తన పైఅధికారుల పేరుతో బెదిరింపులకు దిగడం కూడా కనిపించింది. కాగా, రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య తలెత్తిన ఈ వివాదం కారణంగా ఇప్పుడు ఒకరి బస్సులపై మరొకరు చలాన్లు (జరిమానాలు) విధించుకునే స్థాయికి చేరింది. హర్యానాలో రాజస్థాన్ రోడ్‌వేస్‌కు చెందిన 90 బస్సులపై చలాన్లు విధించగా, రాజస్థాన్‌లో హర్యానాకు చెందిన 26 రోడ్‌వేస్ బస్సులపై చలాన్లు విధించారు.
ఈ వైరల్ వీడియోను ‘ఘర్ కే కలేష్’ (Ghar Ke Kalesh) అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు లక్షన్నర కంటే ఎక్కువ మంది వీక్షించారు. అలాగే వేలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు. కొందరు నెటిజన్లు కామెంట్ల రూపంలో ఆ మహిళా కానిస్టేబుల్‌కు గట్టిగానే క్లాస్ పీకుతున్నారు. ఒక యూజర్ “ప్రయాణం చేయాలనుకుంటే టికెట్ ఖచ్చితంగా కొనాలనేది వంద శాతం నిజం” అని రాయగా.. మరో యూజర్ “వీరేం భిక్షగాళ్లు” అని మండిపడ్డారు. ఇంకొకరు “అవును భయ్యా.. పోలీసులకు కేవలం లంచాలు తీసుకోవడమే తెలుసు, ఇవ్వడం తెలియదు.. ఇప్పుడు ఈ కండక్టర్ నుంచి కూడా ₹100 లాక్కుంటారు ఏమో” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
