విమానాశ్రయానికి మసాలా పొడిని తీసుకువెళ్లినందుకు అరెస్టు అయిన వ్యాపారవేత్త; 57 రోజులు జైలులో గడిపి, రూ. 10 లక్షల పరిహారం పొందారు.!

భోపాల్: విమాన ప్రయాణంలో తన వెంట తీసుకెళ్లిన గరం మసాలా, ఆంచూర్ పొడిని ‘హెరాయిన్’ అని పొరబడి, ఓ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసిన ఘటనలో బాధితుడికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్రంలో సదరు పొడులను పరీక్షించడానికి తగిన లాబొరేటరీలు అందుబాటులో లేకపోవడంతో, వ్యాపారి అజయ్ సింగ్ ఏకంగా 57 రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆయన పడ్డ మానసిక వేదనను, ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం బాధితుడికి 10 లక్షల రూపాయల పరిహారం అందించాలని స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?
అజయ్ సింగ్ భోపాల్ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు ఈ ఘటన జరిగింది. ఎయిర్‌పోర్టులోని ఈటీడీ (ETD) తనిఖీల్లో అజయ్ లగేజీలో అనుమానాస్పద పదార్థాలు ఉన్నట్లు మెషిన్ గుర్తించింది. వాస్తవానికి అజయ్ బ్యాగులో బ్రాండెడ్ గరం మసాలా, ఆంచూర్ పొడి ప్యాకెట్లు ఉన్నాయి. కానీ, ఆ మెషిన్ అవి హెరాయిన్ మరియు MDMA డ్రగ్స్ అని తప్పుగా చూపించడంతో CISF అధికారులు అజయ్ సింగ్‌ను అరెస్టు చేశారు.

లాబొరేటరీల లోపం.. జైలు జీవితం
అధికారులు సదరు ప్యాకెట్లను ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే, ఆ లాబ్‌లో డ్రగ్స్‌ను గుర్తించే పరిజ్ఞానం లేకపోవడంతో 10 రోజుల తర్వాత వారు రిపోర్టును వెనక్కి పంపారు. ఆ తర్వాత వాటిని హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపగా, అవి మత్తుపదార్థాలు కావని, కేవలం మసాలా పొడులేనని తేలింది. అప్పటికే అజయ్ సింగ్ 57 రోజులు జైలులో గడిపారు.

కోర్టులో బాధితుడి వాదన
జైలు నుండి విడుదలైన తర్వాత అజయ్ సింగ్ పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. “ఎయిర్‌పోర్టులోని ఆ మెషిన్ కెనడాలో తయారైనది. అది భారతీయ సుగంధ ద్రవ్యాలను గుర్తించడంలో విఫలమైంది. 750 గ్రాముల ఆంచూర్ పొడిలో 14 శాతం హెరాయిన్ ఉందని, గరం మసాలాలో 10 శాతం MDMA ఉందని ఆ మెషిన్ తప్పుగా రిపోర్టు ఇచ్చింది” అని ఆయన పేర్కొన్నారు. అలాగే పోలీసులు తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఎయిర్‌పోర్టులో నాణ్యమైన పరికరాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.


Posted

in

by

Tags: