వేడి వేడి ఆహారాన్ని ఊదుకుంటూ తినే అలవాటు ఉందా? జాగ్రత్త! 45 ఏళ్ల మహిళకు ఎదురైన ఈ చేదు అనుభవం మీకు రాకుండా ఉండాలంటే ఇది చదవండి.

బీజింగ్: మరీ వేడిగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఒక మహిళ గొంతులో తీవ్రమైన అల్సర్ ఏర్పడింది. ఈ ఘటన మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షాలో జరిగింది.

42 ఏళ్ల వాంగ్ అనే మహిళ అన్నవాహికలో దాదాపు 8 సెంటీమీటర్ల లోతులో అల్సర్ ఏర్పడింది. చలికాలపు ఒక రోజున వాంగ్ తన స్నేహితులతో కలిసి భోజనానికి వెళ్ళింది. బాగా ఆకలిగా ఉండటంతో, ఆహారం కొంచెం చల్లారకముందే వేడివేడిగా ఉండగానే వేగంగా తినేసింది. వెంటనే ఆమెకు ఛాతీలో నొప్పి, మంటగా అనిపించింది. అయితే, దాన్ని అంత సీరియస్‌గా తీసుకోని వాంగ్, ఉపశమనం కోసం ఐస్ వాటర్ తాగింది. కానీ, నీళ్లు తాగినప్పుడు కూడా ఆమెకు భరించలేని నొప్పి కలిగింది.

తర్వాత చాంగ్షాలోని ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా, ఆమె అన్నవాహికలో 8 సెంటీమీటర్ల మేర అల్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఒక వయోజన వ్యక్తి అన్నవాహిక పొడవు 25 నుండి 30 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే ఆమె అన్నవాహికలో దాదాపు మూడో వంతు భాగం అల్సర్‌తో దెబ్బతిన్నట్లు లెక్క.

మన అన్నవాహిక వేడిని తట్టుకుంటుందని చాలామంది తప్పుగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి, అన్నవాహిక 50 నుండి 60 డిగ్రీల సెల్సియస్ వేడిని మాత్రమే తట్టుకోగలదని చైనాకు చెందిన డాక్టర్ వూ జియావోకింగ్ చెబుతున్నారు. వంట చేసిన వెంటనే వడ్డించే ఆహార పదార్థాలు సాధారణంగా 80 నుండి 90 డిగ్రీల సెల్సియస్ వేడిని కలిగి ఉంటాయి. వేడివేడి ఆహారాన్ని తినడం మనందరికీ అలవాటే, కాబట్టి ఇకపై వేడి పదార్థాలను తినేటప్పుడు తగినంత జాగ్రత్త వహించండి.


Posted

in

by

Tags: