భోపాల్: క్షుద్ర పూజలు, చేతబడి, భూతవైద్యం వంటి మూఢనమ్మకాల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. క్షుద్రపూజల పేరుతో బాబాలు, మాంత్రికులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి దారుణమైన ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. సొంత మరిదే భూతవైద్యుడిగా నటిస్తూ, తన వదినపై అఘాయిత్యానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
ఏం జరిగింది? నిందితుడు వృత్తిరీత్యా మెకానిక్, కానీ ఖాళీ సమయంలో భూతవైద్యం చేస్తూ ప్రజలను నమ్మిస్తుంటాడు. తన సొంత సోదరుడి కుటుంబంపై ఎవరో క్షుద్రపూజలు చేశారని, వారిని కాపాడతానని నమ్మబలికాడు. దీంతో సోదరుడు తన కుటుంబ సమస్యలు తీరుతాయని ఆశపడి, నిందితుడిని పూజలు చేయమని కోరాడు.
మాయాజాలం: సోమవారం రాత్రి నిందితుడు పూజల కోసం సోదరుడి ఇంటికి వెళ్లాడు. పూజల కోసం మద్యం, గుడ్లు, కొబ్బరికాయలు సిద్ధం చేయమని చెప్పాడు. మొదట సోదరుడికి కొన్ని పూజలు చేసిన నిందితుడు, అతడిని గదిలో నుండి బయటకు పంపించేశాడు. “నీ భార్యకు పూజలు చేస్తేనే ఈ క్షుద్ర పూజల ప్రభావం నుండి విముక్తి లభిస్తుంది” అని నమ్మించి సోదరుడిని బయటకు పంపాడు.
అఘాయిత్యం: సోదరుడు బయటకు వెళ్లగానే, ఆ మహిళను గదిలోకి పిలిచి లోపలి నుండి గడియ పెట్టుకున్నాడు. ఆమె నుదుటిపై మత్తు కలిగించే పదార్థాన్ని పూయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ స్థితిలో ఉన్న ఆమెపై నిందితుడు దారుణంగా అత్యాచారం చేశాడు. పూజ పూర్తయిందని చెప్పి నిందితుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన దారుణాన్ని భర్తకు వివరించింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
