ధోనీ నా పాస్‌పోర్ట్ తీసుకున్నాడు… నన్ను ప్రపంచ కప్ నుండి వెళ్లిపోమని ఆదేశించారు, రామ్ బాబు మృత్యు అంచున…

న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో ధోనీకి ఎంతో మంది అభిమానులు ఉన్నా, తన జీవితాన్ని పూర్తిగా ధోనీకే అంకితం చేసిన వ్యక్తి ‘రామ్ బాబు’. అనారోగ్యంతో ఉన్నా, జేబులో చిల్లిగవ్వ లేకపోయినా.. ధోనీ ఆడే ప్రతి మ్యాచ్‌కు స్టేడియంలో ప్రత్యక్షమై మద్దతు తెలపడం ఆయనకు అలవాటు.

తొలి భేటీ: ధర్మశాలలోని ఒక చలి రాత్రి 11:37 గంటలకు రామ్ బాబు తన “దేవుడు” ధోనీని మొదటిసారి కలిశారు. ఏడేళ్ల నిరీక్షణ తర్వాత దక్కిన ఆ క్షణాన్ని ఆయన ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. “నేను ఆయన పాదాలను తాకాను, ఆయన నా చేయి పట్టుకుని కౌగిలించుకున్నారు. ఆ రాత్రి నేను నిద్రపోలేదు,” అని రామ్ బాబు భావోద్వేగంతో చెప్పారు. అప్పటి నుండి ధోనీ స్వయంగా రామ్ బాబుకు మ్యాచ్ టిక్కెట్ల ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు.

రామ్ బాబు వెనుక ఉన్న కథ: మొహాలీకి చెందిన రామ్ బాబు 2004లో ధోనీని మొదటిసారి చూశారు. అప్పటి నుండి ధోనీ అంటే ఆయనకు పిచ్చి ప్రేమ. రామ్ బాబు గత 20 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ కూడా వదలకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. “నేను ఉద్యోగం చేయను, ఎందుకంటే ఉద్యోగం చేస్తే మ్యాచ్‌లు చూడలేను. ఎన్నో కుటుంబ వేడుకలను, చివరికి బంధువుల మరణాలను కూడా మిస్ అయ్యాను. నా తల్లి ఎప్పుడూ, ‘ఇది ఎలాంటి ఉద్యోగంరా? నువ్వు జెండా పట్టుకుని తిరుగుతున్నావు అంతే’ అని బాధపడేది. కానీ, ఈ రోజు మొత్తం భారతదేశం నన్ను ఎంఎస్ ధోనీ అభిమానిగా గుర్తుపడుతోంది,” అని గర్వంగా చెబుతారు. కొన్నిసార్లు టికెట్ లేకుండా రైలు ఎక్కినా, తన పరిస్థితి వివరించి టికెట్ చెకర్లను ఒప్పించేవారు.

ధోనీ ప్రాణాలు ఎలా కాపాడారు? 2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలో రామ్ బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, ప్లేట్‌లెట్స్ పడిపోయినా మ్యాచ్ చూడటం ఆపలేదు. ఒక దశలో స్టేడియంలోనే పడిపోయారు. అప్పుడు ధోనీ తన ప్రాక్టీస్ సెషన్‌కు రామ్ బాబును పిలిపించి, ఆయన ఆరోగ్యాన్ని గమనించారు. “నీకు నిలబడే శక్తి లేదు, మరి మ్యాచ్ ఎలా చూస్తావు?” అని ప్రశ్నించారు.

వెంటనే రామ్ బాబు పాస్‌పోర్ట్ అడిగి తీసుకున్న ధోనీ, “ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్లు” అని చెప్పారు. తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేసి, “నీ పాస్‌పోర్ట్ తీసుకో, నీకోసం ఫ్లైట్ బుక్ చేశాను (ఢాకా నుండి చండీగఢ్‌కు). వెంటనే వెళ్లు” అని ఆదేశించారు. చండీగఢ్ చేరుకున్నాక డాక్టర్లు, “ధోనీ సార్‌కు కృతజ్ఞతలు చెప్పు, ఇంకో రెండు రోజులు అక్కడే ఉంటే నీ ప్రాణాలు పోయేవి, నీకు రెండో జీవితాన్ని ప్రసాదించింది ఆయనే” అని చెప్పారట.


Posted

in

by

Tags: