ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ నుండి ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణతో తండ్రిని, భార్యను ఒక వ్యక్తి కర్రతో తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితుడైన కొడుకును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఈ ఘటన ఖాడ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టపర్ గ్రామంలో జరిగింది. తండ్రి, కోడలి మధ్య అక్రమ సంబంధం ఉండటాన్ని చూసిన కొడుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. కర్రతో వారిద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారు ప్రాధేయపడినా వదలకుండా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మరణించాడు, భార్య తీవ్ర గాయాలపాలైంది.
ఖాడ్గావ్ పోలీస్ అధికారి సంజయ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, కట్టపర్లో ఒక హత్య జరిగిందనే సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అడవి మార్గంలో పర్దేశీ రామ్ నురేటి మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. దర్యాప్తులో పర్దేశీ రామ్‌ను అతని కొడుకు అరుణ్ కుమార్ నురేటి హత్య చేసినట్లు తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తండ్రికి, తన భార్యకు మధ్య అక్రమ సంబంధం ఉందని అతను పోలీసులకు చెప్పాడు.
పొలంలో అభ్యంతరకర స్థితిలో.. నిందితుడు దగ్గరలోని దులకి గనుల్లో పనిచేస్తాడు. ఆదివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి రాగా, భార్య మెహరో బాయి ఇంట్లో లేదు. భార్య, తండ్రి కోసం వెతుకుతూ పొలానికి వెళ్ళగా, అక్కడ వారిద్దరినీ అభ్యంతరకర స్థితిలో చూసి నిందితుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే తన చేతిలో ఉన్న కర్రతో వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
పోలీసులు నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడిన మెహరో బాయిని రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.
