ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యువతికి ఇప్పటికే ఐదుగురు పిల్లలు ఉండగా, ఇప్పుడు ఆరోసారి గర్భం దాల్చినట్లు స్పాందన్ హాస్పిటల్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా తోమర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది.
రాజస్థాన్‌కు చెందిన ఈ దంపతులకు 15 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. వారికి ఇప్పటికే నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయినప్పటికీ, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక కొడుకు సరిపోడని, మరో కొడుకు కావాలనే ఆశతో ఆమె మళ్లీ గర్భం దాల్చానని తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మగపిల్లల కోసం సమాజం చూపుతున్న ఒత్తిడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరుస ప్రసవాల కారణంగా ఆ యువతి ఇప్పటికే శ్వాసకోశ ఇబ్బందులు, కళ్లు తిరగడం, తీవ్రమైన ఒంటి నొప్పులతో బాధపడుతోందని డాక్టర్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే, తగిన విరామం లేకుండా వరుసగా పిల్లలను కనడం తల్లి ప్రాణాలకే ప్రమాదమని, దీనికి ప్రధాన కారణం కుటుంబ నియంత్రణపై సరైన అవగాహన లేకపోవడమేనని ఆమె హెచ్చరించారు.
డాక్టర్ ప్రజ్ఞా తోమర్ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ, “ఆమెకు కనీసం అవగాహన వచ్చే లోపే తల్లిని చేశారు,” అని, ఆర్థిక స్తోమత లేకపోయినా వంశాన్ని పెంచుకోవాలనే భర్త అజ్ఞానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
